హైదరాబాద్: ఈ నెల 16న విడుదలవుతున్న రాంచరణ్ చిత్రం బ్రూస్లీ చుట్టూ వివాదం అలుముకుంటోంది. ఈ చిత్రం విడుదల వేసుకుంటే బాగుంటుందని దర్శకరత్న దాసరి నారాయణరావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బ్రూస్లీ విడుదలను వాయిదా వేయాలని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చిరంజీవికి ఒక లేఖకూడా రాశారు. దీనిపై చిరంజీవి స్పందించలేదుగానీ రాంచరణ్ మాత్రం ముందు అడిగి ఉంటే అలాగే చేసి ఉండేవాళ్ళమని అన్నారు. గుణశేఖర్ ఇవాళ దాసరికి రుద్రమదేవి చిత్రాన్ని చూపించారు. ఆయన విలేకరులతో ఆ చిత్రంపై స్పందిస్తూ ఇలాంటి సినిమా తీయాలనే ఆలోచన రావటమే సాహసమని అన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ప్రతిఒక్కరిపై ఉందని చెప్పారు. ఇలాంటి సినిమాలు బతకాలంటే మరుసటివారం పెద్ద సినిమాలు ఆడటం మంచిది కాదని అన్నారు. పెద్దహీరోలుకూడా పండుగలకోసం వెంపర్లాడటం బాధాకరమని పరోక్షంగా బ్రూస్లీ చిత్రంగురించి వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు తుమ్మలపల్లి రామసత్యనారాయణ తన లేఖలో, బాహుబలి విడుదల సమయంలో నిర్మాతల కోరిక మేరకు మహేష్ బాబు శ్రీమంతుడు విడుదలను వాయిదా వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, బ్రూస్లీ విడుదల వాయిదా వేయాలని ఆ లేఖలో కోరారు. దీనిపై రాంచరణ్ స్పందిస్తూ, తాను రూల్స్ బ్రేక్ చేయనని అన్నారు. బాహుబలి, శ్రీమంతుడు, కిక్ 2 నిర్మాతల మధ్య క్లియర్గా అండర్స్టాండింగ్ కుదిరిందని, అందుకే రెండువారాల చొప్పున గ్యాప్ మెయింటైన్ చేయగలిగారని చెప్పారు. అలాగే రుద్రమదేవికి, బ్రూస్లీకి మధ్య అండర్ స్టాండింగ్ జరిగిఉంటే బాగుండేదని అన్నారు. రుద్రమదేవి విషయంలో తనదగ్గరకుగానీ, బ్రూస్లీ నిర్మాత దానయ్య దగ్గరకుగానీ ఎవరూ రాలేదని చెప్పారు. ఒకవేళ వారు వచ్చి అడిగితే ఆలోచించేవాళ్ళమని అన్నారు. ఆగడు టైమ్లోకూడా ఆ సినిమా నిర్మాతల అభ్యర్థనమేరకు గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని రెండువారాలముందు రిలీజ్ చేశామని తెలిపారు. తాము రిలీజ్ డేట్ ప్రకటించినతర్వాతే రుద్రమదేవి, అఖిల్ రిలీజ్ డేట్స్ ప్రకటించారని చరణ్ చెప్పారు. పరోక్షంగా గుణశేఖర్దే తప్పన్నట్లుగా తేల్చారు.