హైదరాబాద్: ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగే కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల రైతులను బట్టలు పెట్టి మరీ ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. రైతులు కాక చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ఆ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చూడటానికి ఆ రోజున మొత్తంమీద లక్ష నుంచి లక్షన్నరమంది హాజరయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ వేడుకకు హాజరయ్యే అశేష ప్రజానీకానికి అదే ప్రాంగణంలో షడ్రసోపేత విందు భోజనాన్ని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించటంతో ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభమయింది. ఏ మాత్రం తేడా వచ్చిన గోదావరి పుష్కరాల దుర్ఘటనలాంటి ప్రమాదం పునరావృతమవుతుందనే వాదన వినబడుతోంది.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్నటి గోదావరి పుష్కరాలస్థాయిలోనే విపరీతమైన హైప్ చేస్తోంది. అన్ని జిల్లాలనుంచి మట్టిని, నీటిని తీసుకురావాలని, ప్రతి ఊరిలో పండగ వాతావరణం నెలకొనాలని ప్రకటిస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రజలు పెద్దసంఖ్యలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముహూర్తం మిట్టమధ్యాహ్నం 12.35-12.45 గంటల మధ్య జరగనుండటం, ఉదయం 10.30 గంటలకల్లా అతిథులతో సహా ప్రజలందరూ తమకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కావాలనటం, అప్పటినుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు కార్యక్రమం కొనసాగనుండటంతో అతిథులు ఆకలితో ఉండకూడదని భావించిన ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెచ్చించి అందరికీ భోజనం వడ్డించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే. కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేదే అసలు సమస్య. ఈ విషయంలో ఏమాత్రం చిన్న పొరపాటు దొర్లినా తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
కార్యక్రమానికి హాజరయ్యే లక్షలమందిని భోజన సమయంలో నిలువరించటం ఎలా అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఆ సమయంలో ప్రజలు ఎవరికి వారు ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తారని, దీంతో రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగే ప్రమాదముందని వాదన వినిపిస్తోంది. కార్యక్రమం ముగిసిన అనంతరం అందరినీ ఒక్కసారిగా భోజనశాలలకు పంపటానికి బదులుగా ఎక్కడ ఆసీనులైనవారు అక్కడే కూర్చుని భోజనం చేసేందుకువీలుగా డిస్పోజబుల్ ప్లేట్లలో చక్కగా ప్యాక్ చేసిన ఆహారాన్ని వారికి అందజేయొచ్చని కొందరు సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగిపోయి, ప్యాకేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నవేళ, భోజనశాలల్లో వడ్డించాలనుకుంటున్న ఆహారాన్ని చక్కగా ప్యాక్ చేసి తాగునీటితోపాటు అందజేస్తే తొక్కిసలాటకు ఆస్కారం ఉండబోదని వారు సలహా ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.