హైదరాబాద్: గత ఏడాది లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడి విజయఢంకా మ్రోగించటం వెనకనున్న కీలక వ్యక్తులలో ప్రశాంత్ కిషోర్ ఒకరు. మోడిని యువతరం అభిమాన నేతగా మలచటంలో, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక అనుసంధాన వేదికలద్వారా మోడిని యువతకు దగ్గరగా చేర్చటంలో ప్రశాంత్ ముఖ్యపాత్ర పోషించారు. చాయ్ పే చర్చ కార్యక్రమానికి రూపకల్పన చేసింది కూడా ప్రశాంతే. బీహార్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మోడిని ప్రశాంత్ ఏ మేరకు దెబ్బకొడతారనేది చర్చనీయాంశమయింది.
సోషల్ మీడియా వ్యూహకర్త ప్రశాంత్ అమిత్ షాతో విభేదాలవల్ల మోడి బృందంనుంచి బయటకొచ్చారు. మధ్యవర్తులద్వారా మోడి శత్రువు నితీష్‌తో చేతులు కలిపారు. ఆయన సలహా మేరకే నితీష్ మాంఝీని దించి మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారట. బీహార్ ఎన్నికలలో నితీష్ కుమార్ ఏర్పాటుచేసిన వార్ రూమ్‌లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐఐటీ, ఐఐఎమ్‌లలో చదువుకుని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగులుగా ఉన్న నిపుణులు ఈ వార్ రూమ్‌లో పనిచేస్తున్నారు. వీరికి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే స్వచ్ఛందసంస్థ కూడా సహకరిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోని ఓటర్లను చేరుకోవటానికి ఫేస్బుక్, వాట్సప్, ఇతర మొబైల్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. నితీష్ కుమార్ ప్రచారం మొదలుకాక ముందే ఈ కేంద్రంనుంచి ఓటర్లకు లక్షలాది ఎస్ఎంఎస్లను పంపించారు. నితీష్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఆయననుంచి సలహాలు తీసుకుంటూ ఈ కేంద్రం పనిచేస్తోంది. బీహారీల డీఎన్ఏ గురించి మోడి వ్యాఖ్యలు చేసినపుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహంమేరకు దానిని నిరసిస్తూ ప్రజలనుంచి గోళ్ళను, వెంట్రుకలను సేకరించి ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి ఒక లారీలో పంపించారు. మరి ప్రశాంత్ వ్యూహాలు బీజేపీని ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలంటే ఫలితాలవరకు ఆగాలి.