తెదేపా ప్రభుత్వం నిర్ణయాలు ఒక్కోసారి చాలా వింతగా… చాలా ఆశ్చర్యం కల్పిస్తుంటాయి. అటువంటి ప్రతిపాదనే అమరావతిలో తాత్కాలిక శాసనసభ నిర్మాణం. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి అమరావతిలో తాత్కాలిక శాసనసభ భవనం అన్ని హంగులతో నిర్మించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. నిర్మించేది తాత్కాలిక శాసనసభ భవనమే అయినప్పటికీ అది ఏవిధంగానూ హైదరాబాద్ శాసనసభకు తీసిపోని విధంగా నిర్మించాలని కోరారు. తక్షణమే దానికోసం టెండర్లు పిలిచి వీలయిననంత త్వరగా నిర్మాణ పనులుమొదలుపెట్టాలని కోరారు. అయితే ఇది తాత్కాలిక శాసనసభ కనుక నిధులు వృధా కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. శాసనసభ భవన డిజైన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదిస్తారని తెలిపారు.
రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలలో శాసనసభ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువయిన అనేక భవనాలు ఉన్నప్పటికీ మళ్ళీ తాత్కాలిక శాసనసభ భవనం ఎందుకు నిర్మించాలనుకొంటున్నారో తెలియదు. ఒకవేళ ఆంధ్రాలో ఏ భవనం కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువుగా లేవనుకొంటే ప్రస్తుతం హైదరాబాద్ లో రాష్ట్రానికి కేటాయించిన శాసనసభ భవనంలోనే సమావేశాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చును. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రాధమిక సౌకర్యాలు కూడా లేని అమరావతిలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసి శాసనసభ భవనం నిర్మించాలనుకొంటోంది! తెదేపాకు చెందిన కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడానికే ప్రభుత్వం పట్టిసీమ పాజెక్టు నిర్మిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుక ఇప్పుడు ఈ నిర్మాణం చేప్పట్టడానికి అదే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తే ఆశ్చర్యం లేదు.
త్వరలో రాజధానికి శంఖుస్థాపన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆ ప్రాంతంలో నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అటువంటి చోట తాత్కాలిక శాసనసభని నిర్మించడం వలన ఊహించని సమస్యలు ఉత్పన్నం కావచ్చును. రెండు మూడేళ్ళలో అక్కడే శాశ్విత శాసనసభ భవనం నిర్మించిన తరువాత ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించబోయే తాత్కాలిక శాసనసభను చేజేతులా కూలదోయక తప్పదు. తాత్కాలిక శాసనసభ కోసం ఇంత ప్రజాధనం దుబారా చేయడమే తప్పు. అటువంటప్పుడు దాని నిర్మాణంలో డబ్బు వృధా కాకుండా చూడాలని కోడెల చెప్పడం హాస్యాస్పదం.
దీనిపై ఎవరో ఒకరు న్యాయస్థానంలో పిటిషన్ వేస్తే, న్యాయపోరాటం చేయడానికి కూడా డబ్బు వృధా చేయకతప్పదు. రాజధానిలో శాసనసభ సమావేశాలు నిర్వహించామని గొప్పగా చెప్పుకోవడానికి తప్ప వేరే మరే ప్రయోజనం ఉండబోదు. ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటునప్పుడు ప్రతిపక్షాలను, సంబంధిత నిపుణులను అభిప్రాయలు అడిగి తెలుసుకొంటే బాగుండేది. కానీ లేడికి లేచిందే పరుగు అన్నట్లు బుర్రలో ఒక ఐడియా మెరవగానే ముందు వెనకా చూడకుండా దానిని అమలు చేయాలని చూస్తే తెరాస ప్రభుత్వంలాగే విమర్శలు మూటగట్టుకోక తప్పదని గ్రహించాలి.