హైదరాబాద్: సౌందర్యరాశుల నగ్న చిత్రాలకు పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ ప్లేబాయ్ వచ్చే ఏడాదినుంచి అలాంటి చిత్రాల ప్రచురణను నిలిపేయబోతోంది. అంటే మేగజైన్ వస్తుంది కానీ దానిలో నగ్నచిత్రాలుమాత్రం ఉండవు. 2016 మార్చి నెల సంచిక నుంచి ఈ మార్పు రాబోతోంది. గతనెలలో ప్లేబాయ్ సంపాదకులు జోన్స్, వ్యవస్థాపకులు హెఫ్నెర్ను సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్య కార్యనిర్వాహకాధికారి స్కాట్ ఫ్లాండర్స్ ప్రకటించారు.
ప్లేబాయ్ మేగజైన్‌ను 1953 సంవత్సరంలో హ్యూ హెఫ్నెర్ ప్రారంభించారు. ప్రారంభ సంచిక కవర్ పేజిగా మార్లిన్ మన్రో (బట్టలతో ఉన్న)చిత్రాన్ని ప్రచురించారు. ఆమె ఒక కేలండర్‌కు ఇచ్చిన న్యూడ్ పోజ్‌ను సెంటర్ ఫోల్డ్‌లో ఇచ్చారు. నగ్న చిత్రాలతోపాటు షార్ట్ స్టోరీలు, నెలకొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ప్రముఖుల ఇంటర్వ్యూలకు ప్లేబాయ్ పేరుగాంచింది. జవహర్లాల్ ఇంటర్వ్యూకూడా ఇచ్చారు. క్రమేణా ప్లేబాయ్ ప్రపంచంలోకెల్లా పేరుగాంచిన బ్రాండ్లలో ఒకటయింది. మేగజైన్ బాగా నడిచే రోజుల్లో ఏటా ఒక బిలియన్ డాలర్ల రెవెన్యూను గడించేది.
ప్లేబాయ్‌ను ప్రస్తుతం నడుపుతోంది ఒక ఇండియన్-అమెరికన్ కావటం విశేషం. సుహేల్ రిజ్వి అనే ఆ వ్యక్తికి చెందిన రిజ్వి ట్రావెర్స్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఇప్పుడు ఆ మేగజైన్‌ను నడుపుతోంది. వ్యవస్థాపకుడు హెఫ్నెర్కు ప్రస్తుతం కంపెనీలో 30శాతం వాటాతోపాటు ఎడిటోరియల్ కంట్రోల్ కూడా ఉంటుంది. అయితే ఒకప్పుడు 56 లక్షలదాకా ఉన్న మేగజైన్ సర్క్యులేషన్ ఇప్పుడు 8 లక్షలకు పడిపోయింది. దీంతో కొత్త యాజమాన్యం ఆలోచనలో పడింది. ఎన్నో తర్జనభర్జనల తర్వాత, నగ్న చిత్రాల ప్రచురణను నిలిపేయాలని కొత్త యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ ఇప్పుడు సులభంగా అందుబాటులో ఉండటంతో నగ్న చిత్రాలు, దృశ్యాలు ఉచితంగా నెట్లో లభిస్తుండటంతో మేగజైన్లలో చూడటానికి ఎవరూ ఇష్టపడటంలేదని యాజమాన్యం నిర్ధారణకొచ్చింది. ఇకముందు పూర్తి నగ్నచిత్రాలను ప్రచురించరుగానీ, అర్ధనగ్నమైన అందమైన చిత్రాలుమాత్రం ఉంటాయి.