హైదరాబాద్: అవినీతి చరిత్ర కలిగిన లాలూతో చేతులు కలపటంపై జేడీయూ నేత నితీష్ కుమార్‌పై విమర్శలున్న సంగతి తెలిసిందే. దానిపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించటంకోసమే ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాలూప్రసాద్‌తో పొత్తు అవసరమయిందని అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి తమ ఎజెండా అని, ఈ ఎన్నికలలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహా కూటమి గెలిస్తే అదే కొనసాగుతుందని చెప్పారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ ప్రభుత్వంలోని మంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలను నితీష్ తేలిగ్గా కొట్టిపారేశారు.
మరోవైపు మోడిని నిర్వీర్యం చేసేందుకే తానూ, నితీష్ చేతులు కలిపామని లాలూ నిన్న ఒక ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలలో నేతలు ఉపయోగిస్తున్న పదజాలంపై ఎన్నికలసంఘం గతవారమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ఉండగా, ఇప్పుడు దానిని పట్టించుకోనట్లుగా లాలూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మోడి తనను సైతాన్ అని వ్యాఖ్యానించినపుడు, దానికి ప్రతిగా లాలూ మోడిని బ్రహ్మపిశాచిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.