హైదరాబాద్: గత ఏడాది జులై 17న 298 మంది ప్రయాణీకులతో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళుతూ పేలిపోయిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఒక క్షిపణితో పేల్చబడటంవలన క్రేష్ అయిందని ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన డచ్ సేఫ్టీ బోర్డ్ నిన్న ప్రకటించటం కలకలం సృష్టిస్తోంది. ఆ క్షిపణి రష్యా తయారీ బ్యూక్ రకానిదనికూడా సేఫ్టీబోర్డ్ చెప్పింది. అయితే ఆ క్షిపణిని ప్రయోగించింది ఎవరనేదిమాత్రం చెప్పలేదు. కానీ, ఉక్రెయిన్ దళాలపై రష్యా మద్దతుతో పోరాడుతున్న వేర్పాటువాదులు ఈ పని చేశారని దర్యాప్తు అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. దీనితో రష్యాకు, పశ్చిమదేశాలకు మధ్య మాటలయుద్ధం మళ్ళీ ప్రారంభమయింది. ఈ నివేదిక పక్షపాతధోరణితో రూపొందించినదని రష్యా ఆరోపించింది. అసలే సిరియా విషయంలో అమెరికా, రష్యాకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతుండగా మలేషియా విమానం దర్యాప్తు నివేదిక దానికి ఆజ్యం పోసినట్లయింది. మరోవైపు విమానం అదృశ్యం ఘటనపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విడిగా సాగుతోంది. ఇది వచ్చే ఏడాది ప్రథమార్థానికి ముగుస్తుందని భావిస్తున్నారు.