గత 15 నెలలుగా నిత్యం ఏదో ఒక వివాదంలో మునిగితేలిన ఆంద్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య మొట్టమొదటిసారిగా సానుకూలంగా వ్యవహరించాయి. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని తను స్వయంగా ఆహ్వానిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దానికి తెలంగాణా ప్రభుత్వం నుండి ఇంతవరకు స్పందన రాకపోవడంతో చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించినా కేసీఆర్ రాకపోవచ్చునని అందరూ భావించారు. కానీ కేసీఆర్ కుమారుడు కె. తారక రామారావు స్పందించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తే శంఖుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని అన్నారు.
ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటువంటి సయోధ్య ఏర్పడినట్లయితే అనేక తీవ్ర సమస్యలు చాలా తేలికగా పరిష్కారం అయి ఉండేవి. కానీ తెలంగాణాలో తెదేపా నేతలు తెరాస ప్రభుత్వానికి సవాలు విసురుతున్నంత కాలం రెండు ప్రభుత్వాల మధ్య ఎన్నటికీ సయోధ్య ఏర్పడే అవకాశాలు లేవు. కనుక చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ తదితరులు అమరావతి శంఖుస్థాపనకి హాజరయినా ఆ తరువాత మళ్ళీ షరా మామూలుగానే రెండు ప్రభుత్వాల మధ్య, పార్టీల మధ్య యుద్దాలు తప్పకపోవచ్చును.