మీడియాలో ఈరోజు చాలా ఆసక్తికరమయిన వార్త వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు మొదటి మూడు నాలుగు రోజులు ఆయనతో సహా వైకాపా నేతలు అందరూ రాష్ట్ర ప్రభుత్వంపై సింహాల్లా గర్జించారు. కానీ దీక్ష ఐదవరోజు చేరుకొనే సరికి జగన్ ఆరోగ్యం వేగంగా క్షీణించడం మొదలుపెట్టడంతో అందరూ చాలా ఆందోళన చెందుతూ ప్రభుత్వం స్పందించడంలేదని నిందించడం మొదలుపెట్టారు. అయినా అప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు జగన్ దీక్షను విమర్శిస్తూ మాట్లడారే తప్ప ఎవరూ కూడా జగన్ ని దీక్ష విరమించమని అడగలేదు. జగన్ ఆరోగ్యపరిస్థితి క్షీణిస్తోంది…ఇంకా ఆలస్యం చేస్తే ఆయన కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని వైకాపా నేతలు, సాక్షి మీడియా ఎంత గట్టిగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ప్రభుత్వం పోలీసులను పంపించి జగన్ దీక్షను భగ్నం చేస్తే చాలనే పరిస్థితికి వచ్చేరు. అయినా అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో వైకాపా నేతలు సమావేశమయ్యి ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలనుకొన్నారుట. తమ నిర్ణయం గురించి స్పీకర్ కోడెల శివప్రసాద్ కి తెలియజేసినట్లు సమాచారం. కానీ రాజీనామాలు చేస్తున్నట్లు ఒకసారి ప్రకటించిన తరువాత ఒకవేళ కొందరు ఎమ్మెల్యేలు అందుకు అంగీకరించకపోయినా లేదా వేరే పార్టీలలోకి వెళ్లిపోయినా అది మరింత అప్రదిష్ట కలిగిస్తుందని గ్రహించిన వైకాపా ఆ ఆలోచనను విరమించుకొన్నట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ కి వారు పంపిన రాజీనామాల సందేశం మాత్రం ఊహించినట్లే చాలా అద్భుతంగా పనిచేసింది. రాజధానికి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా దేశవిదేశాల నుండి అనేకమంది ప్రముఖులు వస్తున్న సమయంలో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినట్లయితే ఊహించని సమస్యలు ఎదురవుతాయనే భయంతోనే ప్రభుత్వం ఏడవరోజు తెల్లవారుజామున పోలీసులను పంపించి జగన్ దీక్షను భగ్నం చేసినట్లు సమాచారం. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏడవ రోజున కూడా జగన్ దీక్ష భగ్నం చేయకపోయుంటే వైకాపా నేతలు ఏమి చేసేవారో? జగన్ చేత వారే బలవంతంగా దీక్ష విరమింపజేసేవారా? లేక రాజీనామాలకు సిద్దపడేవారో?