వైఎస్ పేరుమీద పార్టీని నడుపుతున్న జగన్, ప్లానింగ్ లోపంతో తరచూ తప్పటడుగులు వేస్తున్నారు. ప్రతిక్షణం చంద్రబాబుపై నిప్పులు చెరగడం, లేదా విషం కక్కడమే రాజకీయం అనుకుంటున్నట్టున్నారు. చేయకూడని సమయంలో దీక్ష చేసి మమ అనిపించారు. దాని ప్రభావం ఎక్కడా ఏమాత్రం కనిపించలేదు. ఓ వైపు చంద్రబాబు వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపనను ప్రజల ఇంటింటి కార్యక్రమంగా మార్చారు. ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు తీసుకురావాలని పిలుపునిచ్చి, ఈ వారం పది రోజులూ ప్రజలంతా దీని గురించే చర్చించేలా ప్లాన్ చేశారు. భావి తరాల కోసం భవ్యమైన రాజధాని నిర్మాణానికి చంద్రబాబు తపించి పోతున్నారంటూ తెలుగు దేశం శ్రేణులు ఊరూరా ప్రచారం చేస్తున్నాయి.
ఈ సమయంలో వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన ప్రతిపక్షానికి మేలు చేసే వ్యూహం కాదు. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సన్నాహాలు జరిగే వేళ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం మైనస్ పాయింట్. బహుశా, రేపు రాజధాని శంకుస్థాపనకు వచ్చే ప్రధాని మోడీ భారీ ప్యాకేజీ ప్రకటిస్తారేమో, అది తన దీక్ష ప్రభావమే అని చెప్పుకోవచ్చని జగన్ భావించి ఉంటారు. ఒక వేళ దసరా నాడు మోడీ నిజంగానే ప్యాకేజీ ప్రకటిస్తే వైసీపీకి ప్లస్ పాయింట్ అయ్యేలా చేసేటంత అమాయకుడా? కచ్చితంగా టీడీపీ, బీజేపీకి క్రెడిట్ దక్కే విధంగానే ప్రకటన చేస్తారు. అసలు ప్యాకేజీ ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. రాజధాని నిర్మాణంలో మేము కూడా పాలుపంచుకుంటామని వైసీపీ ముందుకు వస్తే అది పాజిటివ్ పాలిటిక్స్ కు ఉదాహరణ అయ్యేది. కొత్త తరం నాయకుడు జగన్ సరికొత్త తరహా ప్రోయాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకోవడానికి వీలుండేది. ఆ అవకాశం లేకుండా పోయింది. పైగా జగన్ దీక్ష వల్ల ఏం ఒరిగిందనే ప్రశ్నకు సానుకూల జవాబు ఏదీ రావడం లేదు.
రాజధాని అంశం ద్వారా చంద్రబాబు దూసుకుపోతుంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ వ్యూహాలతో జగన్ వెనకబడిపోతున్నారు. వ్యూహ రచనా దురంధరులు, జగన్ ను ఎవరేమన్నా ఏకే 47 లా ఎదురు దాడి చేసే చాలా మంది నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ వ్యవహార శైలితో విసిగిపోయి ఎంతో మంది బయటకు వెళ్లిపోయిన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 16 నెలల నాటి పార్టీకి, ఇప్పటి పార్టీకి చాలా తేడా కనిపిస్తోంది. కేవలం ఒకరిద్దరు వ్యూహకర్తలు అనదగ్గ వారు మాత్రమే జగన్ పక్కన ఉన్నారు. మరోవైపు, తెలంగాణలో వైసీపీ ఉన్నట్టా లేనట్టా అనే పరిస్థితి. రాష్ట్ర విభజన సమయంలో అనుక్షణం అడ్డుపడటానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం లాంటి చోట్ల ఒకటి రెండు విజయాలు లభించాయి. వచ్చేసారి అదీ సాధ్యమా అంటే చెప్పలేం.
ఏపీలో వ్యూహలోపం. తెలంగాణలో ప్రజాగ్రహం. ఈ రెండింటినీ అధిగమించి పార్టీని రాకెట్ లా దూసుకుపోయేలా ప్రయత్నం చేయవచ్చు. అందుకోసం ముందు జగన్ ఒక నాయకుడిలా వ్యవహరించాలి. ఎదుటి వారు చెప్పేది ప్రశాంతంగా వింటూ, ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకొనిపోవాలి. నేను చెప్తాను మీరు వినండి అంటే ఈనాటి రాజకీయాల్లో కుదరదు. అహం బ్రహ్మస్మి అనుకుంటే అసలుకే ఎసరొస్తుంది. అదే జగన్ కు మైనస్ పాయింట్ అవుతుందేమో.