తెలుగు సినిమా పరిశ్రమకు పైరసీ పెద్ద శత్రువుగా మారింది. ప్రతి కొత్త సినిమా కలెక్షన్లలో ఎంతొ కొంత గండికొడుతోంది. నిన్న రుద్రమదేవి పైరసీ గ్యాంగ్ లో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సినిమాను సర్క్యులేట్ చేస్తూ, యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించే వీరి తెలివి అమోఘం! కొత్త సినిమాను ఇక్కడి థియేటర్లలోనే షూట్ చేస్తున్నారని చెప్పలేం. విదేశాల్లో ఏదో ఒక థియేటర్లో చేయవచ్చు. అది అమెరికానో మరో దేశమో కావచ్చంటున్నారు పోలీసులు. ఒక్కసారి ఇంటర్ నెట్లోకి వచ్చేసిందంటే కొన్ని వందల సైట్లు దాన్ని సర్క్యులేట్ చేస్తాయి. డౌన్ లోడ్, ఇతర విధాలుగా డబ్బులు సంపాదించే వారికి ఇది ఈజీ మార్గం అయిపోయింది.
టాలీవుడ్ లో ఎవరి సినిమాకు వారు పైరసీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు టాలీవుడ్ ఏకతాటిపైకి వచ్చి, ఓ యాంటీ పైరసీ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం లేదు. అవసరమైతే సినిమా సంఘాల నుంచి నిధులను సమీకరించి, టెక్నాలజీలో నిపుణులైన వారి చేత ఇలాంటి వెబ్ సైట్లను బ్లాక్ చేయడమో మరో విధంగానో పైరసీని అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నం జరగడం లేదు. ఈ రోజుల్లో ప్రపంచ దేశాలను గడగడలాడించే హ్యాకింగ్ కింగ్ ల్లాంటి వారున్నారు. అలాగే, పైరసీ సైట్లను బ్లాక్ చేసే తెలివి, టెక్నాలజీ ఉన్నవారూ ఉండే ఉంటారు. అలాంటి వారికి తగిన ప్రతిఫలం ఇచ్చి సేవలు ఉపయోగించుకోవచ్చు. హాలీవుడ్ లో ఒక్కో సినిమాను వందల కోట్ల డాలర్లతో తీస్తారు. వాళ్లకూ ఆన్ లైన్ పైరసీ బెడద వచ్చి ఉండొచ్చు. వాళ్లు దాన్ని ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటే ఎలా చేశారు? ఇంకా అనేక దేశాల్లో సినిమాలు తీస్తున్నారు. వారంతా ఈ బెడదను ఎలా కౌంటర్ చేస్తున్నారనే దానిపైనా అధ్యయనం చేస్తే మంచి ఉపాయం దొరకవచ్చు.
ఎవరికి వారు తమ సినిమాకు పైరసీ సమస్య రావద్దని అనుకోవడం వల్ల ఉపయోగం పెద్దగా ఉండదు. అంతా ఏకతాటిపైకి వచ్చి దీన్ని ఒక యుద్ధంగా, సైబర్ వార్ గా భావించి గట్టిగా ప్రయత్నిస్తేనే, తెలుగు సినిమా కలెక్షన్లకు గండి పడకుండా ఆపడం సాధ్యం. లేకపోతే పైరసీ అనే విలన్ దే గెలుపు అవుతుంది. సినిమా అనే హీరోకు ఓటమి అనివార్యం అవుతుంది. సినిమా భాషలో చెప్పాలంటే, యాంటీ క్లైమాక్స్ అన్నమాట !!