జగన్ తన దీక్ష ద్వారా రాష్ట్రంలో తనకున్న ప్రజాధారణ, తన పార్టీ బలం బీజేపీకి చూపించుకొని దానిని తనవైపు తిప్పుకోవాలని ఆశించి ఉండవచ్చును. దానిని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. జగన్ బీజేపీకి గాలం విసిరితే దానికి కాంగ్రెస్ తగులుకొంది. జగన్మోహన్ రెడ్డికున్న ప్రజాధారణ, అతని పార్టీ శక్తిని కాంగ్రెస్ అధిష్టానం బాగానే గుర్తించినట్లుంది. అందుకే జగన్ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ వైకాపాతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీని ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్దంగా ఉందని సూచిస్తున్నట్లుంది.
పదేళ్ళ పాటు సమైక్య రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడా అంతగా కనబడటం లేదు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉందో లేదో తెలియని స్థితి నెలకొని ఉంది. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతించుకోవాలంటే దానిని జగన్ చేతిలో పెట్టడమే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందేమో? అయినా దానికి ఇంతకంటే వేరే మంచి మార్గం లేదు కూడా. కానీ అందుకు జగన్ అంగీకరిస్తారో లేదో మున్ముందు తెలుస్తుంది.
జగన్ ప్రయత్నలోపం లేకుండా ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఏదీ విజయవంతం అవడం లేదు. అందుకు కారణం అధికార తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ప్రతివ్యూహాలే. కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ వంటి రాజకీయ అనుభవజ్ఞుడు వచ్చి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపినప్పటికీ తెదేపా ముందు వారి ఎత్తులు పనిచేయడం లేదు. ఆ సంగతి మొన్న నిరాహార దీక్ష విఫలం అవ్వడంతో మరోమారు రుజువయింది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే అతని పోరాటాలకి కాంగ్రెస్ అండ దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో మళ్ళీ ప్రాణం పోసుకొంటుంది. కానీ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే వారు ఏవిధంగా స్పందిస్తారో అని జగన్ సందేహించనవసరం లేదు. ఎందుంటే కాంగ్రెస్ నేతలను తెదేపాలో చేర్చుకొన్నపటికీ దానిని ప్రజలు ఆదరించారు. కనుక దిగ్విజయ్ సింగ్ ఇస్తున్న ఈ ఆఫర్ ని జగన్ కన్సిడర్ చేయడమే మంచిదని చెప్పవచ్చును.