హైదరాబాద్: పటేల్ సామాజికవర్గాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చాలని కోరుతూ చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన సూచనపై ‘పటేల్ అనామత్ ఆందోళన్ సమితి’ నాయకుడు, యువ సంచలనం హార్థిక్ పటేల్ మండిపడ్డారు. షాకు ఘాటుగా బదులిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు చెప్పినంత మాత్రాన ఉద్యమం ఆపుతామా అన్నారు. వీలయితే తమ డిమాండ్లు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. తాను బతికున్నంతవరకుమాత్రం ఉద్యమం ఆగదని చెప్పారు. ఉద్యమాన్ని బలప్రయోగంతో ఆపాలనుకుంటే తనను చంపాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఒక్క హార్థిక్ పటేల్ చనిపోతే వెయ్యిమంది హార్థిక్ పటేల్లు పుట్టుకొస్తారంటూ మన సూపర్ స్టార్ కృష్ణ లెవల్లో చెప్పారు(ఒక సీతారామరాజు చనిపోతే వెయ్యి సీతారామరాజులు పుట్టుకొస్తారని అల్లూరి సీతారామరాజు సినిమాలో కృష్ణకు ఒక డైలాగ్ ఉంది). తన అభ్యర్థనమేరకు తాము ఉద్యమాన్ని ఆపబోమని తెలిసి అమిత్ షా ఇతర వ్యూహాలద్వారా ఆపటానికి ప్రయత్నిస్తున్నట్లు తనకు తెలిసిందని హార్థిక్ చెప్పారు. అమిత్ షా తమ ఉద్యమానికి దూరంగా ఉండాలని హార్థిక్ డిమాండ్ చేశారు.