హైదరాబాద్: అమరావతి శంకుస్థాపనకు వందలకోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు జగన్, రఘువీరా చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ కొట్టిపారేశారు. ఇప్పటివరకు రు.9 కోట్లే విడుదల చేశామని చెప్పుకొచ్చారు. వీటిలో గుంటూరు జిల్లా కలెక్టర్కు రు.7 కోట్లు, కృష్ణాజిల్లా కలెక్టర్కు రు.2 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇవికూడా ఇంకా పూర్తిగా ఖర్చు కాలేదని అన్నారు. నిధుల ఖర్చు విషయంలో పారదర్శకత పాటిస్తున్నామని, ప్రతి రూపాయినీ ఆచి తూచి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారంచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించటానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఖర్చును ఎక్కువమంది స్పాన్సర్ చేస్తున్నారని చెప్పారు. చాలామంది ప్రముఖులు తమ సొంత ఖర్చుతో వస్తున్నారని తెలిపారు. విపక్ష నేత జగన్ శంకుస్థాపన కార్యక్రమానికి రానని లేఖ రాశారని, అది ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నామని చెప్పారు. ఇది ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, జాతీయ-అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు వస్తున్నారని, కానీ జగన్ మాత్రం రానంటున్నారని విమర్శించారు.
ఇదిలా ఉంటే అమరావతి శంకుస్థాపన ఖర్చులపై లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణకూడా మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి కోట్లు ఖర్చు చేస్తూ ఈ స్థాయిలో రాద్ధాంతం చేయటమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించటంలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి అమరావతిలోనివారు మాత్రం అమరులుగానూ, మిగిలిన ప్రాంతాలలోనివారు అసురులుగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విమానాలకోసం పెట్టిన ఖర్చును అమెరికా అధ్యక్షుడు ఒబామాకూడా పెట్టి ఉండరని అన్నారు. గతంలో హైదరాబాద్లో అన్నీ పెట్టి పొరపాటు చేశామని, ఇప్పుడు చంద్రబాబుకూడా అదే తప్పు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ ప్రత్యేకహోదాగురించి అడగకుండా రాయితీలగురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో ఆరోగ్యం అధ్వాన్నం, అవినీతి అద్భుతం అన్న స్థాయిలో పాలన సాగుతోందని జేపీ మండిపడ్డారు.
మరోవైపు ఏపీ రాజధానికి విరాళాలు ఇచ్చేవారికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఆవిష్కరించారు. మైబ్రిక్-మైఅమరావతి పేరుతో ఈ వెబ్సైట్ను ప్రారంభించారు. వెబ్సైట్ను ప్రారంభించగానే సింగపూర్లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ఒకరు 108 ఇటుకలను కొనుగోలు చేశారు. ఒక్కో ఇటుకను రు.10కు అమ్ముతున్నారు.