సుమారు ఒక దశాబ్ద కాలంగా మహారాష్ట్రాలో డ్యాన్స్ బార్స్ పై నిషేధం కొనసాగుతోంది. దానిని ఈరోజు సుప్రీంకోర్టు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డాన్స్ బార్స్ పై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తున్న డ్యాన్స్ బార్ మరియు డ్యాన్సర్స్ సంఘాలు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. 2005 సం.లో అప్పటి రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసిన ఆర్.ఆర్. పాటిల్ రాష్ట్రంలో డ్యాన్స్ బార్స్ పై నిషేధం విధించారు. ఆ తరువాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు ఆ నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చేరు. కానీ మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల కోసం పోరాడుతున్నామని చెప్పుకొనే శివసేన, హిందూ ధర్మ సంరక్షణకి పేటెంట్ హక్కులు పొందినట్లు మాట్లాడే బీజేపీ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడే ఈ అశ్లీల నృత్యాలపై సుప్రీంకోర్టు నిషేధం ఎత్తివేయడం చాలా విచిత్రం. బీజేపీ, శివసేనలకు చెందిన కొందరు నేతలు డ్యాన్స్ బార్స్ యజమానులతో కుమ్మక్కు అయినందునే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ కేసుపై గట్టిగా పోరాడలేదని ఎన్.సి.పి అధికార ప్రతినిధి నవాబ్ మల్లిక్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని సుప్రీం కోర్టులో మళ్ళీ మరో పిటిషన్ వేసి డ్యాన్స్ బార్స్ పై నిషేధం కొనసాగించవలసిందిగా అభ్యర్ధించమని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.