ఇవ్వాళ్ళ బీహార్ అసెంబ్లీ రెండవదశ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇవ్వాళ్ళ జరిగే ఎన్నికలలో 32 స్థానాలకు 456 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ 32 నియోజక వర్గాలలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జేడీయు), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్.జె.డి.) లకు మంచిపట్టు ఉంది. కనుక ఈ స్థానాలను దక్కించుకొని జనతా పరివార్ పై తమ ఆధిక్యత నిరూపించుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జితన్ రామ్ మంజీ, శరద్ యాదవ్ తదితరులు ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రచారం చేసారు. కనుక ఈరోజు జరుగుతున్న ఎన్నికలు జనతా పరివార్, బీజేపీలకి చాలా కీలకమయినవని చెప్పవచ్చును. ఇవ్వాళ్ళ జరుగుతున్న ఎన్నికలలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ (ఎన్డీయే) ఇమామ్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజక వర్గం నుండి వరుసగా ఐదుసార్లు విజయం సాధించి ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న ఉదయ్ నారాయణ్ చౌదరిని ఆయన ఎదుర్కొంటున్నారు. అదే విధంగా బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన ప్రేమ్ కుమార్ గయ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఇవ్వాళ్ళ జరిగే ఎన్నికలలో బీహార్ ఓటర్లు ఆయన భవిష్యత్ కూడా నిర్దేశించబోతున్నారు.
ఈ 32 నియోజక వర్గాలలో మొత్తం 86,13,870 మంది ఓటర్లున్నారు. వారి కోసం ఎన్నికల సంఘం మొత్తం 9, 119 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. ఇవ్వాళ్ళ జరిగే ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమయినవిగా భావిస్తున్నందున, ఎక్కడా ఘర్షణలు, అవాంఛనీయమయిన సంఘటనలు జరుగకుండా ఉండేందుకు 993 కంపెనీల పారా మిలటరీ దళాలు పహారా కాస్తున్నాయి. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలలో పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటలకే ముగుస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం యధాప్రకారం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆర్. లక్ష్మణన్ తెలిపారు.