సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఐదుగురు సభ్యుల గల కొలీజియం వ్యవస్థ సుప్రీం కోర్టు మరియు దేశంలో అన్ని రాష్ట్రాలలో హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాలను చేస్తుంది. కానీ గత కొన్నేళ్ళుగా వివిధ రాష్ట్రాల హైకోర్టులకు రాజకీయ ఒత్తిళ్ళతో న్యాయమూర్తుల నియామకాలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చేయి. సర్వోన్నత న్యాయస్థానమయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కూడా కొన్నిసార్లు తీవ్ర అభియోగాలు చేయబడ్డాయి. మద్రాస్ హైకోర్టులో ఒకే అంశంపై రెండు ధర్మసనాలు భిన్నమయిన తీర్పులు ఇవ్వడం, వాటిలో ఒకటి తమ నిర్ణయాన్నే అమలుచేయాలని లేకుంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే కోర్టు ధిక్కార నేరానికి చర్యలు తీసుకొంటామని హెచ్చరించడం జరిగింది. ఆంద్రప్రదేశ్, తెలంగాణా హైకోర్టు విభజన చేయకపోతే తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణా ప్రభుత్వం ఆరోపించింది. హైకోర్టుని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు తెలంగాణాపై పెత్తనం చేయాలని చూస్తున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు, సంఘటనలు న్యాయవ్యవస్థకి చాలా అప్రదిష్ట కలిగిస్తున్నాయి. అందుకే కేంద్రం జోక్యం చేసుకొని పార్లమెంటు ఆమోదంతో న్యాయమూర్తుల నియామకానికి జాతీయ న్యాయమూర్తుల నియామక కమీషన్ న్ని ఏర్పాటు చేసింది. కానీ సుప్రీం కోర్టు కోలీజియం దానిని నిర్ద్వందంగా తిరస్కరించింది. న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం, కేంద్రప్రభుత్వం జోక్యం తగదని హితవు పలికింది. ప్రస్తుత కొలీజియం వ్యవస్థ బాగానే పని చేస్తోందని, దానిలో ఏమయినా విధానపరమయిన లోపాలున్నట్లయితే వాటిని సవరించుకొంటే సరిపోతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తుతో కూడిన ఐదుగురు సభ్యుల కొలీజియం అభిప్రాయం వ్యక్తం చేసింది.