హైదరాబాద్: ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ తమిళనాడులో అడ్డంగా బుక్ అయ్యింది. పండగ సీజన్ సందర్భంగా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టవ్ సేల్’ పేరుతో ఒక భారీ సేల్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ యాప్‌పై షాపింగ్ చేసినవారికి ప్రతిరోజూ లక్కీ డ్రా తీసి ఒక కేజీ బంగారం ఇస్తామని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా న్యూస్ పేపర్లలో యాడ్లు గుప్పించింది. అంతవరకు బాగానే ఉంది.
ఈ లక్కీ డ్రా తమిళనాడుకు వర్తించదని, ఆ రాష్ట్ర ప్రజలు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు కారని సంస్థ వెబ్సైట్లో పేర్కొన్న విషయాన్ని తమిళులు కొందరు గమనించారు. వారు దీనిపై అమెజాన్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తమిళనాడు కస్టమర్లు ఈ లక్కీడ్రాలో పాల్గొనటానికి అర్హులు కాకపోతే ఈ రాష్ట్రంలో యాడ్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తమిళనాడులో ప్రచురణ జరిగే అన్ని తమిళ, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో యాడ్లు ఇచ్చారని, ఆ యాడ్ క్లిప్పింగ్‌లను సాక్ష్యాలుగా చూపుతూ కోయంబత్తూరులో తంతై పెరియార్ ద్రవిడర్ కళగమ్ అనే సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది. ఇది తీవ్ర మోసమని, సంస్థ తమిళనాడు ప్రజలపై పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించింది. సంస్థపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. సంస్థ దీనిపై ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా తమిళనాడు ప్రజలకు ఆ లక్కీ డ్రా వర్తించనపుడు అక్కడ దాని తాలూకు యాడ్లు ప్రచురించటం సంస్థ తప్పేనని స్పష్టంగా కనబడుతోంది. మరోవైపు తమిళనాడుకు ఈ లక్కీడ్రా వర్తించకపోవటానికి కారణం ఆ రాష్ట్రంలో ఇలాంటి స్కీములపై నిషేధం ఉండటం కారణంగా తేలింది.