ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా రానని జగన్మోహన్ రెడ్డి చెప్పడంపై తెదేపా మంత్రులు ఒకపక్క ఆయనపై చాలా ఘాటుగా విమర్శలు గుప్పిస్తునే మళ్ళీ ఆయనని ఆహ్వానించడానికి ఆహ్వానపత్రం పట్టుకొని నిన్న మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని ఆయన ఇంటికి వెళ్లి భంగపడి వెనక్కి తిర్గి వచ్చేరు. మంత్రులందరూ ఆయనకి చురకలు వేస్తూనే ఉన్నారు కానీ సాధారణంగా ఎన్నడూ సహనం కోల్పోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి జగన్ విషయంలో పూర్తిగా సహనం కోల్పోయి, జగన్ ఒక రాక్షసుడు…దుర్మార్గుడు…ఓర్వలేని వాడు..అసూయపరుడు..నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు…అమెరికాలో విద్యార్ధులపై తుపాకితో కాల్పులు జరిపే ఉన్మాది వంటివాడు అతనిబారి నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవలసిన అవసరం ఉంది అంటూ చాలా తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
“లోకానికి మేలు చేసే దేవతల ప్రయత్నాలకి ఆనాడు రాక్షసులు ఏవిధంగా అడ్డు తగిలేవారో అలాగే ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేయాలనుకొంటున్న తమకి జగన్ ఆయన పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసూయ,ఓర్వలేనితనంతో బాధపడుతున్నాడని అందుకే ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం మొదలుపెట్టినా దానిని విమర్శించడమే పనిగా పెట్టుకొంటాడని ఆయన అన్నారు. జగన్ వంటి నెగెటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తిని తానెన్నడూ చూడలేదని అన్నారు. గల్లీ నుండి డిల్లీ వరకు అందరూ ఆయనకీ లోకువేనని అందరినీ తప్పుపట్టడం తప్ప ఆయనకి మరొక పనిలేదు.. చేతకాదు కూడా అని అన్నారు. ఒకానొకప్పుడు ఇంతకంటే క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసి సంపద సృష్టించాను. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అలాగే చేయాలనుకొంటునాను తప్ప నా కోసం కాదు. దానికీ జగన్ అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నాడు. అతను ఎంత అడ్డుపడినా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా. కానీ రాష్ట్రాన్ని ఉన్మాదుల వంటి వ్యక్తుల నుండి రక్షించుకోవలసిన అవసరం ఉంది,” అని అన్నారు.