హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఇవాళ నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోవద్ద జరిగిన ఘటనకుగానూ మీడియా ప్రతినిధులకు ఆయన క్షమాపణలు తెలిపారు. ఆ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందించటానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు నానక్‌రామ్‌గూడాలో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌లో ఉన్న పవన్ వద్దకు వెళ్ళారు. ఇది కవర్ చేయటానికి మీడియా ప్రతినిధులు ఓబీ వ్యాన్‌లతోసహా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మంత్రులు పవన్‍ను కలుస్తున్న దృశ్యాలను కవర్ చేయటానికి సెట్‌లోపలికి వెళ్ళబోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఇరువర్గాలకూ మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఒక కెమేరా మ్యాన్‍కు గాయాలయ్యాయి. దీనిపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేయగా పవన్ మీడియాకోసం మంత్రులను తీసుకుని బయటకు వచ్చి ఆరుబయటే ఆహ్వానపత్రిక తీసుకున్నారు. మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయబోనని అన్నారు.
శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు విషయమై మాట్లాడుతూ, తను హాజరు కావాలనే ఉందని, అయితే షూటింగ్‌కోసం గుజరాత్ వెళుతున్నానని, షెడ్యూల్‌ను బట్టి వీలయితే శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. రాజధాని ఎలా ఉండాలని కోరుకుంటున్నారని మీడియా ప్రతినిధులు అడగగా తాను ప్రజల రాజధానిని కోరుకుంటానని, హైదరాబాద్‌లా కాకుండా ఉండాలని భావిస్తున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడుకు సలహాలేమైనా ఇస్తారా అని అడగగా, సలహాలిచ్చేటంత అనుభవం తనకు లేదని చెప్పారు. మొత్తంమీద చూస్తే జగన్ లాగానే పవన్ కూడా శంకుస్థాపనకు గైర్హాజరయ్యేటట్లున్నారు.