ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు చూసిన తరువాత వారివురి పద్దతులు, వ్యవహార శైలిలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న తేడా గురించి చెప్పుకోవడం అవసరమనిపిస్తోంది. జగన్, పవన్ ఇద్దరూ యువనేతలే. జగన్మోహన్ రెడ్డి వైకాపాకు అధ్యక్షుడయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడు. జగన్ తను ముఖ్యమంత్రి అవుదామనే ఏకైక లక్ష్యంతో పార్టీని స్థాపిస్తే, పవన్ “అధికారం కోసం కాదు ప్రజల తరపున నిలబడి ప్రశ్నించేందుకు మాత్రమే” పార్టీ స్థాపించారు. జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియలు కూడా జరుగక ముందే ఆయన స్థానంలో కూర్చొనేందుకు తనకు మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు సేకరిస్తే, పవన్ కళ్యాణ్ తనకి అపారమయిన ప్రజాధారణ ఉన్నప్పటికీ దానిని క్యాష్ చేసేసుకొని తనే ముఖ్యమంత్రి అయిపోదామని ఎన్నడూ ఆరాటపడలేదు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కొనేందుకు ప్రయత్నించినప్పుడు జగన్, పవన్ ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు. జగన్ రెండు రోజులు దాని కోసం దీక్షలు కూడా చేసారు. కానీ వారి భూములు వారికి తిరిగి దక్కాలంటే తను ముఖ్యమంత్రి అవ్వాలని తేల్చి చెప్పారు. అంటే ప్రజలు వైకాపాకే ఓట్లు వేసి గెలిపిస్తే, తను ముఖ్యమంత్రి అయితేనే వారికి న్యాయం చేయగలనని జగన్ కండిషన్ పెడుతున్నారన్నమాట. అదే పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలన్నీ సావధానంగా విని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపి వేయించారు. వారికి న్యాయం చేయడానికి జగన్ లాగ ఆయన రైతులకి ఎటువంటి షరతులు పెట్టలేదు. తన వెనుక ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా తన శక్తిమేర ఏమి చేయగలరో అదే చేసారు.
మళ్ళీ ఇప్పుడు “అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి తనను ప్రభుత్వం బొట్టు పెట్టి పిలిచినా రాను కనుక నన్ను పిలవద్దు. రాకపోతే రాలేదని మళ్ళీ నాపై రాళ్ళేయోద్దు,” అని జగన్ చెపితే, పవన్ కళ్యాణ్ “అదే సమయంలో నాకు గుజరాత్ లో సినిమా షూటింగ్ ఉంది, కానీ వీలయితే తప్పకుండా వస్తానని” చాలా మర్యాదగా చెప్పారు. మంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ఆయన ఇంటికి వెళితే వాళ్ళని కలవదలచుకోలేదు పొమ్మని తన సిబ్బంది చేత చెప్పిస్తే, పవన్ కళ్యాణ్ షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ కాసేపు దానిని నిలిపివేసి వారిని సాదరంగా ఆహ్వానించి, తనను ఆహ్వానిస్తున్నందుకు వారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
జగన్ అడగకుండానే ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటే, పవన్ కళ్యాణ్ తను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేంత పెద్దవాడినికానని సవినయంగా చెప్పుకొన్నారు. జగన్ తను ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నానని విస్పష్టంగా చెపితే పవన్ ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆశిస్తున్నానని తెలిపారు. జగన్ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుంటే పవన్ ‘ప్రజలందరూ గర్వపడేలా, సుఖ సంతోషాలతో వర్దిల్లేలాగ అద్భుతమయిన రాజధాని నిర్మించాలని’ కోరారు.
జగన్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే చెందినవాడయినప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తుంటే, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ ఆంద్రప్రదేశ్-తెలంగాణా రాష్ట్రాలా మధ్య చాల సహృద్భావ వాతావరణం ఏర్పడినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కి దాదాపు రాజకీయ అనుభవం లేనట్లే చెప్పవచ్చును. కానీ వారిద్దరిలో కనిపిస్తున్న ఈ తీవ్ర వ్యత్యాసం గమనించినట్లయితే జగన్ కంటే పవనే చాలా నిజాయితీగా, హుందాగా ప్రవర్తించారని అర్ధం అవుతోంది. అందుకే జగన్ దీక్షలకి జనసమీకరణ చేయవలసి వస్తుంటే, పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు ట్వీటర్ లో ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు జనం సముద్రంలా ఉప్పొంగిపోతూ తరలి వస్తుంటారు. ఒకవేళ శంఖుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు మెసేజ్ పెట్టినట్లయితే, ఆయన కోసం తరలివచ్చే అశేష ప్రజానీకం కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. దటీజ్ పవన్ కళ్యాణ్!