హైదరాబాద్: ‘శ్రీమంతుడు’ తెలుగులో రెండో అతి పెద్ద హిట్ కావటంతో హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్లో తీవ్ర పోటీ ఏర్పడింది. ‘ఈరోస్’ సంస్థ వరుణ్ ధావన్‌తో దీనిని రీమేక్ చేయాలని చూస్తుండగా, ‘వయాకామ్’ సల్మాన్ ఖాన్‌తో రూపొందించాలని భావిస్తోంది. మరోవైపు సల్మాన్‌తో బజరంగీ భాయిజాన్ చిత్రాన్ని తీసి బంపర్ హిట్ కొట్టిన కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కూడా మళ్ళీ సల్మాన్‌తో ‘శ్రీమంతుడు’ రీమేక్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ పోటీలో ఈరోస్ సంస్థే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, సౌత్ ఇండియా సూపర్ హిట్ సబ్జెక్ట్‌లు ఈమధ్య హిందీలో బాగా హిట్ అవుతుండటంతో హిట్లు కొట్టిన సౌత్ నిర్మాతలు రీమేక్ రైట్స్ రేటు విషయంలో చెట్టెక్కి కూర్చుంటున్నారట. శ్రీమంతుడు చిత్ర నిర్మాతలు కూడా దీనికి మినహాయింపు కాదని తెలుస్తోంది. బాలీవుడ్ రీమేక్ రైట్స్ కోసం భారీ రేటు చెబుతున్నారట. ‘శ్రీమంతుడు’ హిందీ రీమేక్ రైట్స్ ఎవరు కొన్నాగానీ, శ్రీమంతులు అయ్యేది మాత్రం తెలుగు నిర్మాతలేనన్నమాట.