ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ్ళ లేఖ వ్రాసారు. అక్టోబర్ 22న ప్రధాని ఆంద్రప్రదేశ్ కి వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో కానీ తిరుపతి విమానాశ్రయంలోగానీ తనకు, తన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఎమ్మెల్సీలకు ఆయనను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వమని తన లేఖలో అభ్యర్ధించారు. జగన్ తన లేఖలో ప్రత్యేక హోదా కోసం తను చేస్తున్న పోరాటాల గురించి వివరించి, ప్రజల ప్రయోజనం కోసమే గుంటూరులో తను దాని కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తన దీక్షని భగ్నం చేసిందని పిర్యాదు చేసారు. అయినా ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పార్టీ నిరంతరంగా పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి క్లుప్తంగా వివరించి, దాని కోసం ఒక మెమొరాండం ఆయనకు ఇచ్చేందుకే కొంత సమయం కేటాయించవలసిందిగా కోరుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి తన లేఖలో తెలిపారు.
జగన్ చేస్తున్న పోరాటాల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. జగన్ తను చేస్తున్న పోరాటాల వలన రాష్ట్రంలో తెదేపా,బీజేపీలని ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి అపాయింట్ మెంట్ ఎందుకు ఇస్తారు? అనే సందేహం ఎవరికయినా కలుగుతుంది. కానీ వైకాపాకి కలగడం లేదు. ఒకవేళ ప్రధాని సంప్రదాయాన్ని మన్నించి ఆయనకి అపాయింట్ మెంట్ ఇవ్వదలచుకొన్నా తను డిల్లీలో ఉన్నప్పుడు వచ్చి కలవమని చెప్పే అవకాశమే ఉంది తప్ప చంద్రబాబు నాయుడుని పక్కనబెట్టి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.