ఆంద్రప్రదేశ్ రాజధానిని ప్రజల భాగస్వామ్యంతో ప్రజా రాజధానిగా నిర్మించాలనుకొంటున్నట్లు మొదట ప్రకటించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత దానిని ఎక్కడ ఏవిధంగా నిర్మించాలి ఎవరు నిర్మించాలి వంటి అన్ని నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకొన్నారు. ఏ విషయంలోనూ ప్రతిపక్షాలను, ప్రజలను సంప్రదించలేదు. రాజధాని నిర్మాణానికి అనువయిన ప్రదేశం కోసం అధ్యయనం చేసిన శివరామ కృష్ణన్ కమిటీ కష్టపడి తయారు చేసి ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో పడేశారు. అధికారం, అభివృద్ధి పూర్తిగా వికేంద్రీకరణ జరిగే విధంగా రాజధాని నిర్మాణం ఉండాలని సూచిస్తే అందుకు పూర్తి విరుద్దంగా అన్నీ పూర్తిగా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యే విధంగా రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు పూనుకొంటున్నారు.
చివరికి భూమి పూజ కార్యక్రమం కూడా తెదేపా స్వంత వ్యవహారంగానే ముగించారు తప్ప ప్రతిపక్షాలు కూడా పాల్గొనలేదు. శంఖుస్థాపన ముహూర్తం విషయంలోను వేద పండితుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఇక దేశంలోనే అత్యంత సారవంతమయిన ఏడాదికి మూడు పంటలు పండే పంట భూములపై రాజధాని నిర్మాణం చేపడుతున్నారు. అందుకు గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, రైతులు, పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాలు, మిత్రపక్షాలయిన జనసేన, బీజేపీ ఇంకా చాలా మంది అభ్యంతరాలు తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం అక్కడే రాజధాని నిర్మాణం చేయడానికి సిద్దపడుతోంది.
ఇంతవరకు ఏకపక్షంగా వ్యహరిస్తూ వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా “మన నీరు మన మట్టి”, “మన ఇటుక మన అమరావతి” అంటూ రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టి రాష్ట్ర ప్రజలందరినీ ఇందులో భాగస్వాములు చేయాలని గట్టిగా ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో ఆయన సఫలం అయ్యారు కూడా. కానీ ఇంతవరకు ఎవరి అభ్యంతరాలు పట్టించుకోకుండా ఎవరి సలహాలు, సూచనలు, భాగస్వామ్యం తీసుకోకుండా కేవలం సింగపూర్ సంస్థల సహకారం ఉంటే చాలన్నట్లు వ్యవహరించిన చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా రాష్ట్ర ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో ఎందుకు భాగస్వాములు చేయాలని ప్రయత్నిస్తున్నారు? అనే సందేహం కలుగక మానదు.
రాజధాని రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొంటున్నప్పుడు ప్రతిపక్షాలు ఎంత వారించినా పట్టించుకోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి నిరసన తెలియజేసేసరికి వెనక్కి తగ్గడం అందరికీ తెలిసిన విషయమే. రాజధానితో సహా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా భూసేకరణ చేస్తుండటం, దానిని రైతులు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం అందరికీ తెలుసు. ఈ భూసేకరణ కార్యక్రమం వలన నానాటికి ప్రజలలో ఎదురవుతున్న వ్యతిరేకత వలన తెదేపాకు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోంది.
అదీగాక ప్రత్యేక హోదా విషయంలో చొరవ చూపకుండా ప్రజలను మభ్యపెడుతున్నందుకు ఇంకా చెడ్డపేరు మూటగట్టుకొంది. అదే సమయంలో జగన్ దానికోసం నిరాహార దీక్షకు కూర్చోవడంతో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. బహుశః ఈ సమస్యలన్నిటి నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికే చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టి యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని కేవలం రాజధాని శంఖుస్థాపన కార్యక్రమంపైనే నిలిపి ఉంచేలా చేయగలిగారు. బహుశః అందుకే జగన్ దీక్షకు ప్రజల నుండి అంత స్పందన రాలేదని చెప్పవచ్చును.