మగ పిల్లలు అన్నాక తప్పులు (రేప్) చేస్తుంటారు…అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి…ఒక అమ్మాయిని ఇద్దరు రేప్ చేస్తే దానిని గ్యాంగ్ రేప్ ఎలా అంటాము…?వంటి మాటలు రాజకీయనాయకులకు మహిళలపట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో తెలియజేస్తుంటాయి. మహిళల పట్ల చులకనగా అటువంటి మాటాలు మాట్లాడటం, ఆ తరువాత మహిళా సంఘాలు, ప్రజలు నిరసనలు తెలియజేస్తే “తమ ఉద్దేశ్యం మహిళలను కించపరచడం కాదని, అయినా తమ మాటలవలన ఎవరినయినా బాధపెట్టి ఉంటే క్షమించమని” సదరు రాజకీయ నాయకులు కోరుతుంటారు. క్షమాపణ కోరినంత మాత్రాన్న మహిళల పట్ల వారి మనసులో అభిప్రాయాలు మారిపోవని అందరికీ తెలుసు. ఒకరు క్షమాపణ చెప్పి ఆ ‘గొడవ’కి ఫుల్ స్టాప్ పెట్టగానే మళ్ళీ ఎక్కడో అక్కడ మరొక రాజకీయ నాయకుడు నోటికి వచ్చినట్లు వాగుతుంటాడు. వారికిదొక దురలవాటుగా మారిపోయింది.
ఇటీవల కర్ణాటకలో ఒక ఆరేళ్ళ పాపని కొందరు సామూహిక అత్యాచారం చేశారు. మీడియా, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ తీవ్రంగా తమ నిరసనలు తెలియజేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని ప్రతిపక్ష బీజేపీతో సహా అన్ని పార్టీలు ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను అసెంబ్లీలో బయటా కూడా ఎండగట్టారు. ‘కానీ నిందితులపై కటిన చర్యలు తీసుకొనేలాగ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి..ఎందువలన?’ అని ఒక మహిళా విలేఖరి ప్రతిపక్ష బీజేపీ నాయకుడు కె.ఎస్.ఈశ్వరప్పను ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన జవాబు విని ఆమె షాక్ అయ్యింది.
“నువ్వు కూడా ఒక మహిళవే కదా…నిన్ను ఇక్కడ ఎవడయినా అత్యాచారం చేస్తే ఎక్కడో ఉన్న మేము అప్పుడు ఏమి చేయగలం? ఏమి చేయాలో నువ్వే చెప్పు…అదే చేస్తాం…” అని అన్నారు. “మేము ఆ అత్యాచారం చేయబడ్డ ఆ అమ్మాయికి న్యాయం జరిగేందుకు శాసనసభలో ప్రభుత్వంతో ఎంతగానో పోరాడితే చివరికి నువ్వు నన్ను ఇటువంటి ప్రశ్న అడుగుతావా?” అని ఆ మహిళా విలేఖరిపై విరుచుకుపడ్డారు. ఒక మహిళా విలేఖరి పట్ల అంత అసభ్యంగా, అనుచితంగా మాట్లాడిన అటువంటి రాజకీయ నేత మహిళల రక్షణ గురించి చట్ట సభలలో చేసే పోరాటాలలో నిజాయితీ ఉంటుందా? ప్రజా ప్రతినిధులకే మహిళలపట్ల ఇంత చిన్న చూపు ఉంటే, నేరస్తులు మహిళలను గౌరవిస్తారా? ఇటువంటి హేయమయిన అత్యాచారాలు ఎప్పటికయినా నివారించడం సాధ్యమా? అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.