ఇవ్వాళ్ళ భారత్-దక్షిణాఫ్రికా దేశాల మధ్య మూడో వన్డే మ్యాచ్ గుజరాత్ లో రాజ్ కోట్ లో జరుగబోతోంది. దానితో బాటే దాని కంటే చాలా ఆసక్తికరమయిన మరో మ్యాచ్ కూడా ఇవ్వాళ్ళ అక్కడే..అదే స్టేడియంలోనే… జరుగబోతోంది. అదేమిటంటే పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ గుజరాత్ లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న హార్దిక్ పటేల్, ఆయన అనుచరులు సుమారు 50, 000 మందికి, పోలీసులకి మధ్య జరుగబోయే మ్యాచ్. ఇవ్వాళ్ళ జరుగబోయే భారత్-దక్షిణాఫ్రికా దేశాల మధ్య మ్యాచ్ ని అడ్డుకొని తమ నిరసన తెలియజేసేందుకు హార్దిక్ పటేల్ ఒక ప్రణాళిక సిద్దం చేసుకొన్నారు. అందుకోసం వారు ముందే 50, 000 టికెట్స్ కొనుకొన్నారు. ఆ విషయం నిన్నమొన్నటి వరకు బయటకు పొక్కనీయలేదు. రాజ్ కోట్ లో మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఖరారు చేసుకొన్న తరువాత హార్దిక్ పటేల్ ఆ విషయం ప్రకటించారు. ఇవ్వాళ్ళ స్టేడియంలో మ్యాచ్ జరగకుండా అడ్డుకొంటామని ప్రకటించారు. దానితో గుజరాత్ ప్రభుత్వం, పోలీసులు, మ్యాచ్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.
ఉద్యమకారుల ప్రయత్నాలను అడ్డుకోవడానికి నిన్న రాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ వినియోగంపై నిషేధం విధించారు. స్టేడియంలో పరిస్థితిని గమనించడానికి పోలీసులు మొట్టమొదటిసారిగా డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. అవికాక స్టేడియం లోపల బయటా అనేక కెమెరాలు ఏర్పాటు చేసారు. సుమారు 4,000 మంది సాయుధ బలగాలను స్టేడియం చుట్టూ మొహరించారు. కానీ మ్యాచ్ చూడటానికి వస్తున్నవారు ఎవరో…వారిలో ఉద్యమకారులెవరో…కనిపెట్టడం మామూలు విషయం కాదు కనుక అందరిలో టెన్షన్ నెలకొని ఉంది. ఉద్యమకారులు 50, 000 మంది టికెట్స్ కొనుకొని లోపలకి ప్రవేశించబోతున్నట్లు హార్దిక్ పటేల్ చేసిన ప్రకటనను పోలీసులు పూర్తిగా కొట్టిపడేయలేకపోతున్నారు. అలాగని పూర్తిగా నమ్మడంలేదు కూడా. అందుకే వారు ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ జరుగకుండా అడ్డుకొంటామని హార్దిక్ పటేల్ చాలా నమ్మకంగా చెపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ కి ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తామని పోలీసులు చెపుతున్నారు. అంటే ఇవ్వాళ్ళ స్టేడియంలో ఒక మ్యాచ్, పోలీసులకి-ఉద్యమకారులకి మధ్య మరొక మ్యాచ్ జరుగబోతున్నాయన్న మాట!