ఆంధ్రప్రదేశ్ లో సాధారణ పరిపాలన లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఆయనకు తీరికలేక పెండింగ్ లో వుండిపోయిన ఫైళ్ళ సంఖ్య 19 వేలకు దగ్గరౌతోందని సిఎం పేషీఅధికార వర్గాల ద్వారా తెలిసింది.”ఏది పట్టుకుంటే అదే”నన్న ముఖ్యమంత్రి వ్యవహారశైలే ఇందుకు మూలకారణం. ప్రస్తుతం చంద్రబాబు ‘అమరావతి’ ని పట్టుకుని వున్నారు.
రాష్ట్రమంతటా డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, వైరల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నా పరిస్ధితిని సమీక్షించే దిక్కేలేదు. కిలో కందిపప్పు ధర 200 రూపాయలకు, మినపపప్పు 160 రూపాయలకు పెరిగిపోతే డిమాండు సప్లయిలను విశ్లేషించి సరుకు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కట్టడి చేయవలసిన యంత్రాంగం ఏమైపోయిందో తెలియదు. స్వచ్ఛభారత్ గురించి స్వయంగా ముఖ్యమంత్రే ప్రధానికి నివేదిక ఇచ్చి వచ్చారు.అయితే అపరిశుభ్రత లో ఏమాత్రం మార్పురాలేదనడానికి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ సాక్షులే! పొగాకు పంట రైతు చేతికందే సమయానికి మఖ్యమంత్రి గోదావరి పుష్కరాల పనిలో వున్నారు. పంట అమ్మకాలు ముగిశాకే ధరవరలను సమీక్షించింది. పుష్కరాల సమయంలోనే ఆపని జరిగి వుంటే వ్యాపారికి మిగిలిన అదనపు లాభం రైతుకే దక్కివుండేది.
ధాన్యం ఇపుడు రైతుల చేతికి అందుతోంది. మిల్లర్లతో, ట్రేడర్లతో సమీక్షలు జరిపి రైతుకి మంచి ధర వచ్చేలా ప్రభుత్వం పలుకుబడిని ప్రయోగించడానికి ఇంత కంటే మంచి అదును వుండదు. అయితే,మొత్తం 13 జిల్లాల జిల్లా కలెక్టర్లు, సమస్త రెవిన్యూ యంత్రాంగం ఇపుడు ప్రతీ ఊరినుంచీ మట్టీ, నీరూ అమరావతికి పంపే పనిలో తీరికలేకుండా వున్నారు. ఒక ప్రభుత్వాధినేత ఒకసారి చెప్పారంటే వందసార్లు చెప్పినట్టే, అదే చంద్రబాబు అయితే వెయ్యేసి సార్లు చెప్పినంత ఫోకస్ ఇస్తారు. దీంతో అధికారయంత్రాంగమంతా ఆయన చూట్టూనే వుంటుంది. మంత్రులు సహచరులుగాకాక, అనుచరులుగానే ప్రవర్తిస్తూంటారు. అతి విస్తృతమైన, అపరిమితమైన అధికారం వున్న ప్రభుత్వ వ్యవస్ధ ఒకరిద్దరి వద్దే కేంద్రీకృతమైపోయినపుడు జరిగే నష్టాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తోంది.
నాయకుల్లో, అధికారుల్లో చొరవ, బాధ్యత లోపించినపుడు ఉత్పన్నమయ్యే నష్టాలకు, ప్రాణనష్టంతో సహా గోదావరి పుష్కరాలే ఉదాహరణ. అన్నీ తానే అయి పుష్కరాలను నెత్తికెత్తుకున్న చంద్రబాబే 28 దుర్మరణాలకూ బాధ్యత వహించాలి. తనను తానే శిక్షించుకునే ఆదర్శం కథల్లో రాజులకు తప్ప ప్రజాస్వామిక ముఖ్యమంత్రులకు వుండవు కనుక పుష్కరాల లొసుగులపై చర్యలు ఎప్పటికీ వుండవనే అర్ధం చేసుకోవాలి.
ప్రతిష్టాత్మకమైన ‘అమరావతి’శంకుస్ధాపనమీదే ముఖ్యమంత్రి దృష్టి కేంద్రీకృతమైవుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది అత్యంతకీలకమైన ఘట్టం కూడా! ఈ ఏర్పాట్లు సమీక్షలు తప్ప ముఖ్యమంత్రి మరే పనీ చూడటంలేదు. ఆయన అందులో ఎంత లోతుగా నిమగ్నమైపోయారంటే…రాష్ట్రవ్యాప్తంగా విదేశాల అధినేతలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారానే ఆహ్వానించాలని ప్రధాని కార్యాలయం గుర్తుచేసేవరకూ తెలియనంత. ఒక నాయకుడికి ప్రోటోకాల్ నిబంధనలు తెలియకపోవడం నేరంకాదు. కానీ, అధికారులకు తెలియకపోతే అది పెద్దనేరమే. అన్నీ తెలిసిన రాష్ట్ర అధికారులు ఢిల్లీ నుంచి ప్రశ్నించే వరకూ ముఖ్యమంత్రికి చెప్పలేదంటే వారి ఉదాసీన, నిర్లిప్తతలను అర్ధం చేసుకోవచ్చు.
ప్రతిపనిలోనూ ప్రజల్ని భాగస్వాములుగా చేయాలన్నది చంద్రబాబు ఆశయమైతే, బాధ్యతాయుతులైన అధికార యంత్రాంగాన్ని నిమగ్నం చేయలేకపోవడం ఆయన వైఫల్యం. ఇది వ్యక్తిగా ఆయనకంటే రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ నష్టం. వికేంద్రీకరణ అన్నది చంద్రబాబు మాటల్లోనే తప్ప చేతల్లో వుండదు. అత్యంత సీనియర్లలో ప్రశ్నించే కె ఇ కృష్ణమూర్తి వంటి వారి అధికారాలను వేరేవారికి కట్టబెట్టడం, అర్ధం చేసుకోగల యనమల రామకృష్ణుడు వంటి వారికి గౌరవ మర్యాదలు మాత్రమే మిగల్చడం ఇందుకు పెద్ద ఉదాహరణం.