రాజధాని ప్రాంతలోని లింగయ్యపాలెంలో మంత్రులు పరిటాల సునీత, కిమిడి మృణాలినీ ఇంటింటికీ వెళ్ళి ‘అమరావతి’ శంకుస్ధాపనకు సకుటుంబంగా తరలి రావాలని పిలిచారు. ఆహ్వాన పత్రికతో పాటు గృహస్ధుకి ధోవతి, గృహిణికి చీర ఇంటిల్లపాదికీ మిఠాయిలు వున్న బాక్స్ అందజేశారు.
లింగయ్య పాలెంలోనే కాదు అన్ని గ్రామాల్లో, రాజధానికి భూములిచ్చిన ప్రతీ రైతు కుటుంబాన్నీ ఆయాగ్రామాల బాధ్యతలు తీసుకున్న మంత్రులు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. రాజధానికి ఇంత భూమి అవసరమా? వికేంద్రీకరణే విధానమని చెప్పి మొత్తం కేంద్రీకరించేస్తున్నారు…అమరావతిని మినహా రాష్ట్రాన్నే గాలికొదిలేశారు…మొదలైన విమర్శలను సుముహూర్తం అయ్యేదాకా పక్కన పెడితే ప్రజలనుంచి ఎమోషనల్ సపోర్టు అందుకునేటంత మానవీయ సంకల్పాన్ని శంకుస్ధాపన సన్నాహాల్లో మేళవించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కుటుంబవేడుకగా మలచిన ఘనత కూడా అన్నీ తానై విమర్శలు మోస్తున్న ముఖ్యమంత్రికే దక్కుతుంది.
ఆకాశమంత పందిరి భూదేవి అంత అరుగుగా ముస్తాబౌతున్న శంకుస్ధాపన ఉత్సవానికి నాలుగు లక్షలకు పైగా ఆహ్వాన పత్రికలు పంచారు. పాల్గొంటున్నవారిలో ప్రధాని, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల కేటగిరిలో 15 మంది అత్యంత ముఖ్యులు వున్నారు. వీరుగాక విఐపిలను మూడు తరగతులుగా విభజించారు. మొదటి తరగతిలో 700 మంది, రెండో తరగతిలో 2 వేలమందీ, మూడో తరగతిలో 3 వేల ఐదువందల మందీ వున్నారు. వస్తున్నట్టు కన్ ఫర్మ్ చేసిన విదేశీయుల సంఖ్య 160 అని కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు చెప్పారు.
భూములిచ్చిన రైతులు కుటుంబ సమేతంగా 30 వేల 700 మంది, రాష్ట్రవ్యాప్తంగా స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు 40 వేలమంది, రకరకాల స్ధాయిల్లో వున్న మరో 5 వేలమందికీ ప్రభుత్వ ఆహ్వానాలు వెళ్ళాయి. అతిధులకు వారి వారి స్ధాయిలకు తగిన విధంగా వాహనాల నిలుపుదల స్ధలాలను కేటాయించి పాస్ లను రూట్ మ్యాప్ లను ఆహ్వాన పత్రికలతో పాటే ఇచ్చారు.
ఏర్పాట్లను సమన్వయం చేయడానికి 300 మందిని లయిజనింగ్ ఆఫీసర్లను నియమించారు. వీరిలో 47 మంది తహశీల్దార్లు, 45మంది డిప్యూటీతహశీల్దార్లు, 46 మంది యం.పి.డి.ఓలు, 23 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 82 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుతో పాటు మరో 60 మంది జిల్లా స్ధాయి అధికారులు వున్నారు. వీరంతా 20 ఏరియాలలో పనిచేయవలసి వుంటుంది.
లక్షమంది అతిథులను రిసీవ్ చేసుకుని ఏమాత్రం అసౌకర్యంలేకుండా వారిక కేటాయించిన ఎన్ క్లోజర్లలోకి పంపడం చిన్న విషయం కాదు.”కత్తి మీద సాము”లాంటి సమన్వయం మీద అవగాహన కల్పించే శిక్షణా కార్యక్రమం విజయవాడలో ఇప్పటికే మొదలైంది. బందాలు బృందాలుగా ఆదివారం రాత్రికూడా ట్రెయినింగ్ ఇచ్చారు. 21 న ప్రాంగణంలో రిహార్సిల్స్ వుంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఊరినుంచీ మట్టీ, నీరూ నియోజకజకవర్గ కేంద్రానికీ, అక్కడినుంచి జిల్లా కేంద్రానికీ ఆదివారం నాటికే చేరుకున్నాయి. అక్కడినుంచి అలంకరించిన ప్రత్యేక వాహనాల్లో అమరావతికి సోమవారం ఉదయం ప్రయాణమౌతున్నాయి. నా నేల నా నీరు నా రాజధాని అనేభావనను మనిషి మనిషిలో ప్రోదిచేయడమే ఈ క్రతువుకి కారణం. ఐదుకోట్లమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల్నీ ఆకాంక్షల్నీ లక్షమంది ప్రత్యక్ష సాక్షులుగా పునాదుల నుంచీ అమరావతిలో పొదగడమే ఈ మహా క్రతువు లక్ష్యం.
ఇంతటి భారీ సన్నాహాలు ఒక సందర్భాన్నో, సంఘటననో ఉత్సవీకరించడానికి మాత్రమేకాదు… రాష్ట్రాన్ని ఏకపక్షంగా చీల్చేసిన కాంగ్రెస్ దుర్మార్గానికీ, ప్రత్యేక హోదాపై ముంచకుండా తేల్చకుండా నాన్పుడు ద్రోహం చేస్తున్న బిజెపి ధోరణికీ కుంగిపోకుండా నైతిక దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ, భావసమైక్యతనూ ప్రజల్లో సాధించే ప్రయత్నంగా అర్ధంచేసుకోవాలి.