హైదరాబాద్: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ రాయలసీమకు ద్రోహమే చేశారని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హైదరాబాద్‌ను లాక్కున్నాడని, హైదరాబాద్ అభివృద్ధిలో రాయలసీమవాసుల కృషికూడా ఉందని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ సీమవాసులను మోసంచేసి చంద్రబాబు నూతన రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాలలో పెట్టాడని అన్నారు. బైరెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన జరుగుతున్న 22వ తేదీ రాయలసీమ వాసులకు చీకటి దినం అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సీమ వాసులు రాయలసీమ ద్రోహులని వ్యాఖ్యానించారు. కొన్ని దశాబ్దాలుగా అన్నిఅంశాలలో సీమకు అన్యాయమే జరుగుతోందని, దీనిని చంద్రబాబునాయుడు కొనసాగించారని చెప్పారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతంలో బాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని అన్నారు. చంద్రబాబు సొత్తయినట్లు రాజధాని నిర్మాణానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ దుర్వినియోగంపై పిల్ వేస్తామని బైరెడ్డి చెప్పారు. మొత్తంమీద రాయలసీమలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని బైరెడ్డి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి.