హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్ళటం మొత్తంమీద ఖరారైపోయింది. ఈ నెల 22న జరిగే ఆ కార్యక్రమానికి వెళ్ళటంద్వారా 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రా నేలపై అడుగుపెట్టబోతున్నారు. తిరుమల వెంకన్నను దర్శించుకోవటం మినహా ఆంధ్రా ప్రాంతంలో ఈ 14 ఏళ్ళలో కేసీఆర్ పర్యటించటం ఇదే ప్రథమం.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచే రోజులలో ఆంధ్రా ప్రాంతంలో విభజనను సమర్థించే కొందరు తలపట్టిన కార్యక్రమాలకు కేసీఆర్ హాజరవ్వాల్సిఉన్నా అది ఎందుకనో వాస్తవరూపు దాల్చలేదు. 2010 మే నెలలో కత్తి పద్మారావు వంటి కొందరు నేతలు జై ఆంధ్ర ఉద్యమం, ఏపీ దళిత మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు మద్దతుగా ఒక బహిరంగ సభను ప్లాన్ చేసి కేసీఆర్ను ఆహ్వానించారు. ఆ సభ ‘లైలా’ తుపాను కారణంగా రద్దయిపోయింది. కేసీఆర్ కూడా చాలా సందర్భాలలో తాను ఆంధ్రా ప్రాంతంలో పర్యటించి విభజన అవసరాన్ని వివరిస్తానని, విభజనవలన ఆంధ్రా ప్రాంతానికి లాభముంటుందని చెబుతానని ప్రకటించారుకూడా. లగడపాటి రాజగోపాల్, టీడీ వెంకటేష్ వంటి కాంగ్రెస్ నేతలు ఈ ప్రకటనను ఆహ్వానించి, తాముకూడా తెలంగాణలో పర్యటించి సమైక్య ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని వివరించటానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే శాంతి భద్రతల సమస్యల కారణంగా ఈ రెండింటిలో ఏదీ వాస్తవరూపు దాల్చలేదు.
మరోవైపు తెలంగాణ వస్తే తిరుమల శ్రీవారికి, బెజవాడ దుర్గమ్మకు, అజ్మీర్ దర్గాకు మొక్కుకున్న కేసీఆర్, పనిలో పనిగా అమరావతికి హాజరయ్యేముందు అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. కేసీఆర్ మొక్కులకోసం తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖనుంచి రు.5.59 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజులలో కేసీఆర్ తిరుమలకు, బెజవాడకు వెళ్ళి మొక్కు తీర్చుకుందమనుకున్నారని, అయితే అమరావతి కార్యక్రమం కారణంగా ఆ మొక్కును ముందుకు జరిపారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెప్పారు.