రాజధాని నిర్మాణంకోసం ల్యాండ్ పోలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం 29 గ్రామాలలో రైతుల నుంచి భూమి సమీకరించింది. అయితే ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఆ రెండు గ్రామాలలో రైతులు కూడా సుమారు 600 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించారని రాష్ట్ర వ్యవసాయ శంఖుస్థాపన మంత్రి ప్రతిప్పటి పుల్లారావు మీడియాకు తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని, చిత్తశుద్ధిని గుర్తించి ఆ రెండు గ్రామాల రైతులు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వచ్చేరని అందుకు వారికి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. వారు కోరినట్లుగానే గ్రామ కంఠాల విస్తీర్ణాన్ని మరో వంద ఎకరాలకు పెంచేందుకు అవసరమయిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇంకా మరొక 1400 ఎకరాలను సమీకరించవలసి ఉందని త్వరలోనే ఆ రైతులు కూడా స్వచ్చందంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని పుల్లారావు అన్నారు.