వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పోరాటాలు సరిగ్గా ఎప్పటి నుండి ఉదృతం చేసారు అంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చి హెచ్చరించిన తరువాత నుండే అని చెప్పవచ్చును. అంతకు ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. “దాని గురించి పార్లమెంటులో మా ఎంపీలు పోరాడుతుంటే మళ్ళీ నేనెందుకు దాని గురించి మాట్లాడాలి…పోరాడాలి?” అని ఎదురు ప్రశ్నించేవారు కూడా. కానీ రాహుల్ గాంధీ హెచ్చరించిన తరువాత ఆయన డిల్లీ వెళ్లి ఐదు గంటలు ధర్నా చేయడం తరువాత రాష్ట్రంలో దాని గురించి బంద్, నిరాహార దీక్షలు వగైరా హడావుడి చేస్తూనే ఉన్నారు.
గమనించవలసిన ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ఆయన ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలుపెట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాలని పూర్తిగా నిలిపివేసింది. అంతే కాదు అవసరమయితే జగన్ పోరాటాలకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ మధ్యనే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అంటే రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకొనే పరిస్థితి కనబడకపోవడంతో ఏదో విధంగా వైకాపాకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.
జగన్మోహన్ రెడ్డి తొందరపాటుతోనో లేక చంద్రబాబు నాయుడుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగానో “రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రాను కనుక నన్ను పిలవద్దు” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బహుశః కాంగ్రెస్ పార్టీ ఆయనని ప్రసన్నం చేసుకోనేందుకేనేమో తాము కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించేసింది. మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ కార్యక్రమాన్ని ఒక రాష్ట్ర కార్యక్రమంలాగా కాకుండా చంద్రబాబు నాయుడు తన ఇంట్లో కార్యక్రమమంలా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని ఆహ్వానించిన తీరు కూడా బాగోలేదు. అందుకే మేము ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకొన్నాము,’ అని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై వినిపిస్తున్న విమర్శలు చూసిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని బహిష్కరించాలని అనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం అలవాటే కానీ ఎంతో అనుభవం ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా వ్యవహరించాలనుకోవడమే వింత. తాము ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపి, ఆయనకు దగరవ్వాలనునుకొంటున్నారేమో తెలియదు కానీ దాని వలన వారికి ప్రజలు ఇంకా దూరం అయ్యే అవకాశం ఉందని గ్రహిస్తే మంచిది.