నిర్ణయాధికారం ఎప్పుడూ అధికార పార్టీ నాయకత్వానిదే! అలాగే కీలక ఘట్టాలలో అఖిల పక్షాలనూ కలుపుకుని వెళ్ళవలసిన ప్రజాస్వామిక ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత కూడా పాలక పక్షానిదే! ఈ ధర్మం మీద చంద్రబాబు నాయుడు కి నమ్మకం వున్నట్టులేదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఘనమైన రాజధానిని నిర్మించే ఉన్న ఉత్సాహాన్ని పంచుకోడానికైనా ముఖ్యమంత్రి అఖిల పక్షాలను కూర్చోబెట్టలేదు. ఫలితంగా ప్రతిష్టాత్మకమైన రాజధాని ప్రాజెక్టుతోపాటే స్వరాష్ట్రంలోనే తీవ్రమైన అసమ్మతి వుందని కూడా దేశమంతా ఉచిత ప్రచారమై పోతుంది.
అమరావతి శంకుస్ధాపనను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇదే నిర్ణయాన్ని వెల్లడించింది.
కొత్త రాజధాని వ్యవహారాలు పారదర్శకంగా లేకపోవడం, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్ధకు అడ్డూ అదుపూ లేని అధికారాలు కట్టబెట్టడం, అన్ని విషయాలూ ముఖ్యమంత్రి మరికొందరు మంత్రులు పార్టీ వ్యవహారంలా చక్కబెట్టుకోవడం వంటి కారణాలనే బహిష్కరణకు కారణాలుగా మొదట జగన్ ప్రకటించారు.
శంకుస్ధాపనను బహిష్కరించాలన్న రాష్ట్రకాంగ్రెస్ కమిటీ నిర్ణయాన్ని శైలజానాధ్, గంగా భవాని, కొండ్రు మురళి ఈ రోజు వెల్లడిస్తూ చెప్పిన కారణాలూ ఒకటే! ఇక ఇప్పుడు తెలుగుదేశం వారు టివిల ముందు చెలరేగిపోతారు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటేనని మరోసారి ప్రజలకు తెలిసిపోయిందని ప్రకటిస్తారు. వాళ్ళు ప్రతీదీ రాజకీయం చేసేస్తున్నారని ఆడిపోసుకుంటారు. రాజకీయాల్లో వున్న వాళ్ళు రాజకీయాలు మాత్రమే చేస్తారనీ, చేయాలనీ, అదే ఒక కౌంటర్ చెక్ గా ప్రజాప్రయోజనాలకు కాపలాకుక్క గా వుండే రాజకీయ ప్రక్రియ అనే ప్రాధమిక జ్ఞానం కూడా లేనివారు మాత్రమే అలా మాట్లాడ గలుగుతారు. అయితే రెండు పార్టీలూ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తారు. ఇదంతా సమాధానంలేని ప్రశ్నలను తివాచీ కిందికి తోసేసి ఆల్ ఈజ్ వెల్ అనడం లాంటిదే!
యాభైలక్షల మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమే తప్ప పార్టీ వ్యవస్ధే లేదా! సమస్య వచ్చినపుడు రాజకీయపార్టీలతో మాట్లాడవలసింది రాజకీయపార్టీలు కాకపోతే ఇక పార్టీ నిర్మాణాలు ఎందుకు?
ప్రతిపక్షాలు సరే మిత్రపక్షమైన బిజెపి భాగస్వామ్యం కూడా అమరావతి సన్నాహాల్లో కనిపించడంలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ముఖ్యంగా కృష్ణా,గుంటూరు జిల్లాల తెలుగుదేశం నాయకుల కార్యకర్తల సందడి హెచ్చుగా వుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు గుంటూరు, కృష్ణాజిల్లాలకు వచ్చికూడా స్వయంగా నరేంద్రమోదీ శంకుస్ధాపన చేసే ఈ కార్యక్రమ సన్నాహాలను చూడనైనా చూడలేదు. తెలుగుదేశం పార్టీ, వారిని ఇన్వాల్వ్ చేయకపోవడమే ఇందుకు మూలం.
నిజానికి అఖిలపక్ష సమావేశాల ద్వారా ప్రజామోదం పొందడమే ముఖ్యమంత్రులకు సుళువైన పని. ప్రత్యక్ష ప్రసారాలౌతున్న చట్ట సభల్లో మాదిరిగా అఖిలపక్ష సమావేశాల్లో పట్టు వీడకపోవడ మనే ఇబ్బంది వుండదు. రాజ్యాంగ పరమైన అధినేత ముందు కూర్చుని మొండిగా వాదించే అదే పనిగా పట్టుబట్టే వరకూ ఏపార్టీ ప్రతినిధీ తెగించరు. పాలకపక్షంలో విశేషంగా గౌరవమర్యాదలు అందుకునే సీనియర్ నాయకుల ముందస్తు దౌత్యం కూడా అఖిలపక్ష సమావేశాల సాఫల్యానికి బాటవేస్తుంది. అటువంటి బాధ్యతలను భుజాన వేసుకోడానికి తెలుగుదేశంలో యనమల రామకృష్ణుడు కి మించిన వారు లేరు. అయితే జగన్ మీద విరుచుకు పడటంలో ఆయన ఉత్సాహం యువకులకి కూడా వుండదు.
ప్రజాప్రయోజనం అయివుంటేనే చాలదు. అది ప్రజాప్రయోజనకారి అని హెచ్చుమందికి అనిపించడం అతిముఖ్యం. ఇందుకు నాయకులకు ఓర్పుసహనాలు వుండాలి. అవిలోపిస్తూండటంవల్లే రాజకీయాల్లో ‘ఇష్టారాజ్యం’ అనే మాట పుట్టినట్టుంది.
అంకితమైన స్వభావంతో కష్టపడి పనిచేసే నాయకుల జాబితాలో చంద్రబాబు ముందే వుంటారు. అవినీతి పరుడన్న విమర్శతోపాటు ప్రజాస్వామిక ధర్మాలను అతిక్రమించని వ్యక్తిగా చరిత్రకెక్కిన మర్రిచెన్నారెడ్డి లోని సహనం కానీ, అన్నిప్రజాస్వామిక ప్రోసీజర్లూ పాటిస్తూనే ఇష్టారాజ్యం చేసే నియంత కెసిఆర్ లౌక్యం కానీ చంద్రబాబునాయుడుకి లేవు. అందువల్లనో ఏమో చంద్రబాబు ముప్పై ఏళ్ళలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశాలు డజను కూడా లేవు.
బాబు ఎవరు చెప్పినా వింటారు…అందరు ముఖ్యమంత్రులలాగే తాను నమ్మిందే చేస్తారు. అయితే చిన్న ప్రశ్ననుకూడా తట్టుకోలేరు. అసహనాన్ని దాచుకోలేరు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ, ప్రతిపక్షనాయకుడిగా వున్నపుడూ ఆయన ధోరణి అదే. రాష్ట్రం బయట మీడియా సమావేశాలు ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతూంటాయి. అందుకే తన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఆయనకు ప్రధాన ఆధారం సెలక్టివ్ మీడియానే! ధర్డ్ పార్టీగా వున్న ఆ మీడియా విశ్వసనీయత కూడా మసకేసిపోతోంది.
ఏమైనాకానీ, ఎవరు బహిష్కరించినాకానీ శంకుస్ధాపనకు ఎలాంటి ఇబ్బందీ వుండదు. అయితే అందరినీ కలుపుకుని వెళ్ళలేని, ప్రధాన పక్షాలను పక్కనపెట్టిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నమోదౌతారు. ఇది రాష్ట్రప్రభుత్వానికీ, తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబు నాయుడుకీ గౌరవం కాదు…”నేనింతే” అనే తెగింపు ప్రదర్శించడం జగన్ కి నప్పినట్టుగా బాబుకి సూటయ్యే విషయంకాదు!