హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తన భేటీలతో సంచలనం సృష్టిస్తున్నారు. గత నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ కాగా, నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. దిగ్విజయ్ నిన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళారు. వీరు ముగ్గురే కొంతసేపు సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత, ఇతర ముఖ్యమైన అంశాలేమీ లేవని, కేవలం మర్యాదపూర్వకంగానే రామోజీరావును కలిసినట్లు దిగ్విజయ్ మీడియాకు వెల్లడించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు వరసగా రామోజీని కలవటం వెనక ఆంతర్యమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. వారు ఏదో ప్రయోజనాలను ఆశించే రామోజీతో భేటీ అవుతున్నారనేది స్పష్టమేగానీ ఆ ప్రయోజనమేమిటనేది ఇదమిత్థంగా తెలియంటలేదు. జగన్తో భేటీ కాగానే చంద్రబాబునాయుడుతో సంబంధాలు చెడిపోయాయని, అందుకే జగన్తో భేటీ అయ్యారనే ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే మొన్న చంద్రబాబు స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆహ్వానపత్రం ఇవ్వటంతో ఆ ఊహాగానాలు నిజంకాదని నిర్ధారణ అయింది. మరి తెలుగుదేశానికి సన్నిహితంగా ఉండే రామోజీపై వైసీపీ, కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లుండి ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.