హైదరాబాద్: లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమనిగానీ, కనీసం వెనకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీలు ప్రకటించమనిగానీ ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటివరకు కేంద్రాన్ని అడగనే లేదని జేపీ అన్నారు. హోదా సంజీవని కాకపోతే ఇంకేది సంజీవనో చెప్పాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడును కోరారు. ప్యాకేజి పేరిత ఇచ్చే డబ్బు పాలకుల ఆర్భాటలకే తప్ప ప్రజలకు ఉపయోగపడదన్నారు. పరిశ్రమలకు పన్ను రాయితీలవల్ల కేంద్రంమీద ఒక్క పైసా భారంకూడా పడదని, పైగా అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినా, హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏపీలోని 13 జిల్లాలలో సుదీర్ఘకాలంగా పారిశ్రామికీకరణ జరగలేదని జేపీ చెప్పారు. ఫలితంగా ఉపాధి అవకాశాలు దాదాపు లేవని అన్నారు. రాయితీలొస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. అందుకే ప్రత్యేక హోదాను తొలుత తానే ప్రతిపాదించానని అన్నారు. ఏపీకి ఐదేళ్ళలో రెవెన్యూ లోటు ఎంత ఉందనే విషయాన్ని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా లెక్కగట్టి నిర్దిష్టమైన ప్రకటన చేయలేకపోయిందని, దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని తాను చాలాసార్లు డిమాండ్ చేశానని జేపీ చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఒక వస్తువును తయారు చేయటానికి రు.100 ఖర్చయితే, రాయితీలున్న రాష్ట్రంలో రు.70కే తయారు చేయొచ్చని అన్నారు. తక్కువ ధరలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటే పరిశ్రమలు ఆటోమేటిక్గా వస్తాయని, పదేళ్ళు రాయితీలు ఉండి పారిశ్రామికీకరణ జరిగితే తర్వాత అభివృద్ధి కొనసాగుతుందని జేపీ చెప్పారు.