హైదరాబాద్: రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఖరారయింది. ఇవాళ సాయంత్రం రోడ్డు మార్గంలో సూర్యాపేట వెళతారు. అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో రాత్రికి బసచేసి ఉదయాన్నే విజయవాడ చేరుకుంటారు. ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడిని సందర్శించుకుని, అమ్మవారికి ముక్కుపుడక సమర్పించే మొక్కు తీర్చుకుంటారు. అక్కడనుంచి హెలికాప్టర్లో శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకుంటారు. కేసీఆర్ రాకపోకల విషయంలో చంద్రబాబు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు.
శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతున్నారు. విభజనకు మూలకారకుడైన కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కార్యక్రమానికి హాజరవటం ఒక విశేషమని చెప్పాలి. మరోవైపు ఓటుకునోటు కేసు నేపథ్యంలో బద్ధ శత్రువులుగా మారిపోయిన ఇరు ముఖ్యమంత్రుల మధ్య అమరావతి పుణ్యమా అని మళ్ళీ స్నేహం చిగురించటంతో కేసీఆర్ రాకకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఓటుకు నోటు కేసు ముందుకెళ్ళకుండా చేయటంకోసమే చంద్రబాబు కేసీఆర్కు అంత ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు ఎలా ఉన్నా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడాలని ఆశిస్తున్నవారికిమాత్రం కేసీఆర్ రాక మంచి పరిణామంగానే అనిపిస్తుంది. అందుకేనేమో విజయవాడ నగరంలో పలుచోట్ల కేసీఆర్ను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.
మరోవైపు అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై కేసీఆర్ పేరును చేర్చటంపై వివాదం ఏర్పడింది. ప్రొటోకాల్ ప్రకారం వేదికపై ఉన్న మోడి, బాబు, ఇతర ముఖ్యమంత్రులు, గవర్నర్ల పేర్లలో భాగంగా కేసీఆర్ పేరునుకూడా చేర్చారు. అయితే రాష్ట్ర విభజనకు మూల కారకుడైన కేసీఆర్ పేరును శిలా ఫలకంపై ఎలా చేరుస్తారంటూ కొందరు టీడీపీ నేతలు వేదికవద్ద అసంతృప్తి వ్యక్తంచేశారు. అధికారులు వారికి సర్ది చెప్పారు.