జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వానించినా ఆయన తన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం గుజరాత్ వెళ్ళిపోయారు. కనుక ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేవనే భావించవచ్చును. ఆయన రాజకీయాలలోకి రాకుండా లేదా రాజకీయాలు మాట్లాడకుండా కేవలం సినిమాలు చేసుకొంటున్నట్లయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా ఎవరూ ఏమీ అనుకొనేవారు కారు. కానీ జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించి, అడపాదడపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ హడావుడి చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమానికి రాకపోయినట్లయితే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలలాగే ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పదు.
ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, జూ. ఎన్టీఆర్ ని ఈ కార్యక్రమానికి ఎవరూ ఆహ్వానించలేదని సమాచారం. తెదేపాకు ఆయనకు మధ్య దూరం పెరిగి ఉండవచ్చును. కానీ ఒకప్పుడు అదే జూ.ఎన్టీఆర్ తెదేపా విజయం కోసం ఎన్నికలలో ఎంతగా కష్టపడ్డారో జ్ఞప్తికి తెచ్చుకొన్నట్లయితే, ఆయనకు ఆహ్వానం పంపకపోయుంటే అది సబబు కాదు. ఆహ్వానించకపోయినా ఈ కార్యక్రమానికి హాజరవుదామని జూ.ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ న్ని వెళ్లి ఆహ్వానించినా వచ్చేలా లేరు. జూ.ఎన్టీఆర్ ని పిలవక పోయినా రావాలనుకొంటున్నట్లు సమాచారం.