హైదరాబాద్: ఎన్నోరోజులుగా అత్యంత ఆసక్తిని రేకెత్తింకించిన చరిత్రాత్మక, ప్రతిష్ఠాత్మక ఘట్టం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించబోతున్న నూతన రాజధాని అమరావతికి ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇవాళ శంకుస్థాపన చేశారు.
ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంనుంచి మోడి దిగారు. గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోడికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడనుంచి ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక హెలికాప్టర్లో శంకుస్థాపన ప్రాంగణానికి బయలు దేరారు. 12.20 గంటలకు వీవీఐపీ హెలిప్యాడ్పై ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. యాగశాలలోకి వెళ్ళేముందు అక్కడ ఏర్పాటు చేసిన అమరావతి 3డీ ప్లాన్ను సందర్శించారు. ప్రవేశద్వారంలో నిలుచుని ఉన్న చంద్రబాబు కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్లను పలకరించారు. దేవాంశ్తో కొద్దిసేపు ముద్దులాడారు. చంద్రబాబు అమరావతి 3డీ ప్లాన్ ద్వారా రాజధాని విశేషాలను వివరించారు.
12.30 గంటలకు మోడి యాగశాలలోకి ప్రవేశించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలమధ్య హోమగుండంలో పూర్ణాహుతిని సమర్పించారు. నవధాన్యాలు, యాగద్రవ్యాలను వదిలారు. చంద్రబాబుతోపాటు నరసింహన్, కేసీఆర్, వెంకయ్య నాయుడుకూడా నవధాన్యాలను హోమగుండంలో వేశారు. తర్వాత వేద పండితులు వారందరినీ ఆశీర్వదించారు. అక్కడనుంచి బయటకొచ్చిన మోడి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడనుంచి మోడి, తదితరులు బహిరంగసభ వేదికపైకి వెళ్ళారు.