హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడి విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాభంగం కలిగించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో మోడి ఏదో తాయిలం ప్రకటిస్తారని ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. ఎన్నికలముందు ఏపీకి తాను హామీ ఇచ్చిన ప్రత్యేకహోదానుగానీ, కనీసం స్పెషల్ ప్యాకేజిగానీ కూడా మోడి ప్రకటించలేదు.
శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోడి అన్ని మాటలూ చెప్పారు… ప్రత్యేకహోదా తప్పితే. మోడికి ముందు మాట్లాడిన చంద్రబాబు, మోడి గతంలో తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని ప్రస్తావించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మోడి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశించిందని అన్నారు. గొప్ప రాజధాని నిర్మాణానికి పూనుకున్నందుకు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రులు కోరుకుంటున్న విధంగా అమరావతి అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటుందని మోడి అన్నారు. శతాబ్దాల చరిత్ర, ఆధునిక హంగుల కలయికతో అమరావతి అద్బుతంగా ఉంటుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రలుగా వేరైనా, ఆత్మ ఒక్కటే అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించటానికి చంద్రబాబు స్వయంగా వెళ్ళారని తెలిసి చాలా సంతోషమేసిందని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి పనిచేయాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ అవసరమైన సహాయ సహకారాలు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్బంగా యూపీఏ ప్రభుత్వం ఏఏ హామీలు ఇచ్చిందో వాటన్నంటినీ తాము అమలు చేస్తామని చెప్పారు. మోడి-బాబు జోడితో ఏపీ అద్బుతంగా అబివృద్ధి చెందుతుందని అన్నారు.
మొత్తంమీద చూస్తే ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని పక్కాగా కన్ఫర్మ్ అయిపోయింది. అయితే విభజన చట్టంలోని హామీలన్నింటినీ తు.చ. తప్పకుండా నెరవేరుస్తామనటమొక్కటే కాస్త ఆశావహంగా ఉంది. దానితోపాటు, మోడి-బాబు జోడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందనటంకూడా మంచి పరిణామమే. ఇది జగన్ బేచ్ కు నిరాశ కలిగించే విషయం. బీజేపీ-టీడీపీ మధ్య చిచ్చు రగిలితే జగన్ దానిద్వారా లబ్ది పొందుదామనుకుంటున్న సంగతి తెలిసిందే. మరి మోడి ఏమో బాబుతో బంధం బలంగా ఉందని చెప్పటం వైసీపీకి మింగుడుపడని మాటే కదా. అయితే ప్రత్యేక హోదాగానీ, ప్యాకేజిగానీ ప్రకటించకపోవటంతో ఆ సమస్య సజీవంగా ఉండటమొక్కటే జగన్ పార్టీకి, దానితోపాటు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కలిసొచ్చిన అంశం. ఈ రెండు పార్టీలు ఇక రేపటినుంచి రెచ్చిపోనున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.