హైదరాబాద్: ఉత్తరాదిన ఘనంగా జరిగే రావణ దహనం కార్యక్రమం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నేతలను ఒక్కచోటకు చేర్చింది. ఢిల్లీలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రావణ దహనం కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఒకే వేదికమీదికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడికూడా ఈ కార్యక్రమానికి హాజరు కావలసి ఉన్నప్పటికీ, ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాల రీత్యా రాలేకపోయారు. వేదికపై కూర్చున్న అగ్రనేతలకు నిర్వాహకులు ఆయుధాలను బహూకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి త్రిశూలాన్ని, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి గదను, మన్మోహన్‌కు కరవాలాన్ని, సోనియా గాంధికి విల్లును, అమిత్ షాకు గొడ్డలిని అందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన నాటకంలో అలనాటి బాలీవుడ్ విలన్ శక్తికపూర్ మేఘనాథుడిగా అలరించారు. తర్వాత భారీ సైజులోని రావణ, మేఘనాథ, కుంభకర్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.