విశ్లేషణ:
ఆంధ్రప్రదేశ్ కు ఇపుడు వున్న ”స్ట్రక్చర్” లో ఎలాంటి సహాయమూ చేయలేమన్నది మాత్రమే రాజధాని శంకుస్ధాపనలో భారతప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ”మౌన సంకేతం”. కొత్త స్ట్రక్చర్ ఏర్పడ్డాక ప్రత్యేకహోదా వల్ల ప్రయోజనాలను మరో రూపంలో మరో పేరుతో ఇచ్చే అవకాశాన్ని “హోదా కు మించిన ప్రయోజనాలు” గా బిజెపి, తెలుగుదేశం నాయకులు లీక్ చేస్తున్నారేతప్ప అదేమిటన్న స్పష్టీకరణ మోదీకే ఇంకా వచ్చినట్టు లేదు. ప్రణాళికా సంఘాన్ని మోదీ రద్దు చేసి నీతి ఆయోగ్ ను నియమించినపుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదంతా పసిగట్టేశారు. అందుకే స్వతంత్రించి లక్ష కోట్లరూపాయల అమరావతి నిర్మాణానికి సింగపూర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
రాజకీయాల గురించి చర్చించుకోవడంలో, వాదించుకోవడంలో, ఆఖరికి పందేలు కాయడంలో ప్రజలకు వున్న ఆసక్తి ముఖ్యంగా అధికారంలో వున్న నాయకుల రాజకీయాలను నడిపించే ఆర్ధిక సిద్ధాంతాల మీద లేదు. ఆర్ధిక వ్యవహారాలను పత్రికల్లో రాసే కాలమిస్టులు మినహా మీడియా ఫోకస్ కూడా దేశాన్ని నడిపించే ఆర్ధిక విధానాల మీద లేదు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు రాదో అర్ధం చేసుకోవాలంటే సంక్షేమరాజ్యం కోసం నెహ్రూ ఆర్ధిక విధానమైన ” మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ” గురించి రేఖామాత్రంగానైనా తెలుసుకోవలసిందే. అప్పటి అమెరికా పెట్టుబడిదారీ లక్షణాలను, సమస్తమూ ప్రభుత్వ సొంతమే అయిన రష్యా సోషలిజాన్నీ కలగలిపి ‘మిక్స్ డ్ ఎకానమీ’ ని నెహ్రూ రూపొందించారు. అందులో నిధులు మిగిల్చి వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించే సంక్షేమ కర్తవ్యం వుంది. ఈ అంశాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి అదనపు/ప్రత్యేక సహాయాలపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి ఫైనాన్స్ కమీషన్ , ప్లానింగ్ కమీషన్లు ఏర్పాటయ్యాయి.
పివి నరశింహారావు ప్రధానిగా వున్నపుడు మొదలైన ఆర్ధిక సంస్కరణలవల్ల ”మార్కెట్ ఎకానమీ” ముందుకొచ్చి ”మిక్స్ డ్ ఎకానమీ” ని అటక ఎక్కించింది. దాంతోపాటే ఆవ్యవస్ధ కు పుట్టిన అనేక అంగాలు నిర్వీర్యమైపోయాయి. అందులో ఫైనాన్స్ కమీషన్ ఒకటి. వాజ్ పాయ్ ప్రధానిగా వున్నపుడు ఏర్పాటైన ఉత్తరాఖండ్ మొదలైన రాష్ట్రాలకు ”ప్రత్యేక తరగతి హోదా” ఇవ్వడానికి కమీషన్లకు బూజుదులిపి సిఫార్సులు చేయించి ‘హోదా’ఇచ్చారు.
సీమాంధ్ర ప్రయోజనాలు తుంగలో తొక్కి పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని చీల్చేసిన కాంగ్రెస్ కంటితుడుపు చర్యగా ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్ళు ప్రత్యేక హోదా హమీని ఇచ్చింది. ఐదేళ్ళు కాదు పదేళ్ళని వెంకయ్యనాయుడు పెడబొబ్బలు పెట్టారు. కాంగ్రెస్, బిజెపిలకు ఆధారం అటకెక్కిన కమీషన్లే.
ఆర్ధిక వ్యవహారాల్లో తమపై ఆధారపడిన దేశాల్లో రెండోదశ ఆర్ధిక సంస్కరణలను వేగవంతం చేయాలని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యసంస్ధ మొదలైన ఆర్ధిక సంస్ధలు వత్తిడి చేస్తున్నాయి. ఒకసారి ఆసంస్ధలనుంచి రుణాలు తీసుకున్న ఏ దేశమూ ఆషరతుల నుంచి తప్పించుకోలేదు. సంస్కరణలు కాంగ్రెస్ హయాంలో ప్రారంభమయ్యాయి. బిజెపి హయాంలో ముమ్మరమయ్యాయి. పరస్పరం విమర్శలతో దుమ్మెత్తిపోసుకునే ఈ రెండు పార్టీలూ ద్రవ్యసంస్ధల షరతుల గురించి మాత్రం తోడుదొంగల్లా నోరుమెదపకపోవడమే విశేషం.
సంస్కరణల రెండోదశలో భాగంగా ద్రవ్యసంస్ధల షరతుల ప్రకారం పెద్ద లాండ్ బ్యాంక్ సిద్ధంచేసి పెట్టుబడిదారుల సమాచారంకోసం ఆన్ లైన్ లో వుంచాలి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలి. ఈ మేరకు భూసేకరణ బిల్లునీ,గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సు బిల్లునీ చట్టాలు చేయాలని మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపధ్యంలోనే వెంకయ్యనాయుడు హామీ అయిన ప్రత్యేక తరగతి హోదా మోదీ కంటిలో నలుసైంది. ఏకీకృత పన్ను వ్యవస్ధలో వనరులను క్రోడీకరించి అవసరాలను బట్టి రాష్ట్రాలకు కేటాయించడానికి అప్పటికే నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేశారు.
కొత్తవ్యవస్ధ విధివిధానాలు ఖరారుకాలేదు. ఇలాంటప్పుడు, పాతిపెట్టేసిన పాతస్ట్రక్చర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ”ప్రత్యేకతరగతిహోదా” ఇవ్వడం కుదరదు. ఏడాదిన్నరకే డొల్లదేరిపోతున్న నరేంద్రమోదీ మరింత రాజకీయ స్ధిరత్వం సాధించుకుంటేగాని సంస్కరణలే హిడెన్ ఎజెండాగా ప్రతిపాదించిన బిల్లులను చట్టాలు చేయించలేరు. బీహార్ ఎన్నికల ఫలితాలు, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా వుంటేతప్ప కొత్త ‘స్ట్రక్చర్’ ఏర్పడదు.
ఇదంతా బాగా ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా స్పెషల్ పాకేజీలు కోసం ఎదురు చూసేకంటే సొంత ఈత మొదలు పెట్టడమే మంచిదనుకున్నారు. సింగపూర్ ప్రభుత్వంతో సహా ఆదేశపు సంస్ధలు, జపాన్, చైనా సంస్ధలు వున్న కన్సార్టియం తో లక్ష కోట్లరూపాయల అమరావతి నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏదేశపు పెట్టుబడిదారులకైనా భారతదేశంలో భూమిని సమకూర్చుకోవడమే పెద్దసమస్య. అటువంటి స్ధితిలో మరేరాష్ట్రంలోనూ లేనివిధంగా భూసమీకరణ ద్వారా రైతుల నుంచి సునాయాసంగా 33 వేల ఎకరాల భూమి సేకరించడం చంద్రబాబు సాధించిన అపూర్వ విజయం. ఆయన కోరిన విధంగా మరో 50 వేల ఎకరాల అటవీ భూములను కూడా రాజధానికి కాస్త ఆలస్యమైనా కేంద్రం కేటాయిస్తుంది. భూమే పెట్టుబడిగా, స్వతంత్ర ధోరణే ధైర్యంగా చంద్రబాబు రాజధాని నిర్మాణంలో దిగిపోయారు. సమాజం ఆర్ధికాభివృద్ధికి వనరులు, అవసరాలను సమన్వయం చేసి అంశాలు, రంగాల వారీగా చోదక శక్తుల నిర్మాణం అన్ని ప్రభుత్వాలూ చేసే పనే. అయితే రాజధాని నిర్మాణాన్నే ఒక గ్రోత్ ఇంజన్ గా, ఒక డ్రివెన్ ఫోర్సుగా మార్చేస్తున్న ప్రయోగం బహుశ చంద్రబాబు తప్ప ఎవరూ చేసి వుండరు.
చంద్రబాబు ఏమిచేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నరేంద్రమోదీకి తెలుసు. అలాగని కేంద్రం నుంచి రాష్ట్రం ఏసహకారమూ ఆశించడంలేదని మోదీ ఎప్పటికీ అనుకోరు. కేంద్రం ఏమిచ్చినా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తగాదాపడదని, కనీసం పేచీకూడా పెట్టదని కూడా మోదీ అర్ధం చేసుకున్నారు.
డబ్బులేనివాడు ముందే పడవ ఎక్కేసినట్టు భూమే పెట్టుబడిగా లక్షకోట్లరూపాయల రాజధాని నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు ఇందులో ప్రజల్ని ఉద్వేగభరితంగా నిమగ్నం చేయడానికే రాష్ట్రవ్యాప్తంగా వున్న 13 వేల ఊళ్ళ నుంచి మట్టినీ నీటినీ రప్పించి రాజధాని ప్రాంతమంతటా ఆకాశం నుంచి స్వయంగా వెదజల్లారు. అడగకపోయినా తానే విషయం తెలుసుకుని పార్లమెంటునుంచి మట్టినీ, యమునా నది నుంచి నీటినీ తెచ్చానని అవి వుంచిన పాత్రలను అందజేయడంలో, చంద్రబాబుతోసహా లక్షల మంది వీక్షకులను ఆశ్యర్యపరడంతోపాటు ఇక్కడ ఏమిజరిగినా తనకి తెలిసిపోతూందన్న నిగూఢ సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చారు.
ఏమైనాకానీ, బాబూ, మోదీలు ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు. ఆర్ధిక సిద్ధాంత పరంగా వీరిద్దరి మధ్య వున్న భావసారూప్యత మోదీకి వెంకయ్య నాయుడుకీ కూడా బహుశ వుండదేమో! శంకుస్ధాపన వేదిక మీద పెద్దలందరూ సంతోషాలు పంచకున్నారు. అసలు విషయాలను దాచిపెట్టి సామాన్య ప్రజల విశ్వాసానికి మట్టీనీరూ కలిపి తిలోదకాలు ఇచ్చేశారు.