ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఏదో ఒక వివాదంతో కీచులాడుకొంటున్నారని ప్రతిపక్ష నేతలు వారిని విమర్శించేవారు. కానీ ఇప్పుడు వారిద్దరూ కొంచెం సన్నిహితంగా మెలిగితే దానినీ తప్పు పడుతున్నారు. వారిద్దరి మధ్య సంధి కుదిర్చిన వారెవరో తనకు తెలుసునని సమయం వచ్చినప్పుడు వారి పేరు బయట పెడతానని తెలంగాణా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. నిజానికి వారిద్దరి మధ్య ఎవరయినా సంధి కుదిర్చిఉన్నట్లయితే వారికి షబ్బీర్ అలీ తో సహా అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇద్దరు చంద్రుల మధ్య సంధి కుదిర్చడానికి గవర్నర్ నరసింహన్ చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ పని మరెవరో చేసి ఉంటె అందుకు సంతోషించాలి తప్ప అదేదో కుంభకోణం అన్నట్లుగా షబ్బీర్ అలీ మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిజానికి వారిద్దరూ సఖ్యతగా ఉండాలనే ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుకొంటున్నారు. వారి మధ్య సఖ్యత ఏర్పడితే ప్రభుత్వాల మధ్య కూడా సహకార ధోరణి ఏర్పడుతుంది. అప్పుడు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చిన్న చిన్న సమస్యలని అధిగమించగలిగితే రెండు రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. కనుక ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవలసి ఉంటుంది తప్ప వారేదో నేరం చేసినట్లు చెప్పడం సబబు కాదు.
కొన్ని నెలల క్రితం తెలంగాణా విద్యుత్ సంస్థల నుండి ఆంధ్రా మూలాలు ఉన్న కారణంగా 1252మంది ఉద్యోగులను తెలంగాణా ప్రభుత్వం వారి విధులలో నుండి తప్పించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పజెప్పింది. కానీ వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇంతకాలంగా రెండు ప్రభుత్వాలు, కోర్టుల చుట్టూ వాళ్ళు ఎన్ని ప్రదక్షిణాలు చేసినా పరిష్కరం కాని సమస్య ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఏర్పడటంతో హైకోర్టు ఆదేశాలను మన్నిస్తూ వారినందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకొంటున్నట్లు తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యతగా ఉంటే దాని ఫలితం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఇదే చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చును.