అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ కూడా చేరిపోయారు. దసరాకు ముందురోజే సీబీఐ అధికారులు ఓ పాత కేసుకు సంబంధించి కేసీఆర్ ను ప్రశ్నించడం విశేషం. ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన పలువురు నేతలపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. వీరిలో హర్యానా, బీహార్ మాజీ ముఖ్యమంత్రులకు ఇప్పటికే జైలు శిక్ష పడింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా జైలు శిక్ష పడింది. అయితే సుప్రీంకోర్టు ఆమె నిర్దోషి అని తీర్పు చెప్పింది.
కేసీఆర్ యూపీఏ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇ ఎస్ ఐ ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును ఫిషరీస్ డిపార్ట్ మెంట్ కు ఇవ్వడం వల్ల ఖజానాకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కేసు నమోదైంది. ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై మొదట మత్స్యశాఖ ప్రాథమిక విచారణ తర్వాత సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి కేసు నమోదు చేశారు. అలా, 2011లో కేసు సీబీఐ చేతికి వచ్చింది.
సదరు ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్టును మొదట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించారు. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ కు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేసి, ఫిషరీస్ శాఖకు అప్పగించడంపై సీబీఐ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్టు సమాచారం. కేసీఆర్ అప్పుడెప్పుడో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేసు సీబీఐ చేతికి వెళ్లి కూడా చాలా కాలమైంది. హటాత్తుగా ఇప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించడం గమనార్హం. ఓ వైపు ఓటుకు నోటు కేసు దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటికే అరెస్టయి బెయిల్ పై విడుదలయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా నోటీసు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ సమయంలో సీబీఐ అధికారులు పాత కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగడమే విశేషం.
కేసీఆర్ అవినీతి మరక లేని నాయకుడని, కాబట్టి సీబీఐ కేసు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు తెరాస నేతలు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోనే అవినీతిని సహించేది లేదని చాలా సార్లు స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు నిలవదని, కేసీఆర్ కు ఏ ఇబ్బందీ లేదని అనుచరులు ధీమాగా చెప్తున్నారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు ఈ కేసును కారణంగా చూపి ఆరోపణల దాడి చేయవచ్చని భావిస్తున్నారు. అలాంటి ఆరోపణలు వస్తే దీటుగా ఎదుర్కొంటామంటున్నాయి గులాబీ శ్రేణులు.