సుమారు 15 ఏళ్ల కిందట బిహార్‌కు చెందిన మూగ, చెవిటి గీత అనే బాలిక పొరపాటున భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో లాహోర్ చేరుకొంది. అప్పటికి ఆమె చాలా చిన్నపిల్ల కావడం, పైగా మూగ చెవుడు కావడంతో ఆమె ఎక్కడి నుంచి వచ్చిందనే సంగతి ఎవరూ కనుగొనలేకపోయారు. అప్పటి నుండి నేటి వరకు కూడా పాకిస్తాన్ లోని ఈథీ ఫౌండేషన్ ఆమె బాగోగులు చూసుకొంటోంది. ఆమె పాకిస్తాన్ లో ఉంటునప్పటికీ తను భారత్ నుండి తప్పిపోయి అక్కడకు చేరుకొన్నానని, తను హిందూ మతస్తురాలిననే విషయం ఆమెకు తెలిసి ఉండటం విశేషం. ఇదొక సినిమా కధలాగ ఉంది.
సరిగ్గా అటువంటి కధతోనే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన “బజరంగీ భాయ్ జాన్” అనే సినిమా పాకిస్తాన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. అప్పుడే గీత అనే ఆ అమ్మాయి కధ కూడా వెలుగులోకి వచ్చింది. ఆమె గురించి అన్ని టీవీ ఛాన్నాళ్ళలో వివరాలు వస్తుండటం చూసిన గీత తల్లి తండ్రులు ఆమె చిన్నప్పుడు తప్పిపోయిన తమ కుమార్తెనని గుర్తుపట్టి, ఆ సంగతి ప్రభుత్వానికి తెలియజేసారు. ఆమెను తిరిగి తమకు అప్పగించవలసిందిగా కోరారు. దానిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను తిర్గి రప్పించడానికి చర్యలు చేప్పట్టింది. భారత అధికారులు పంపించిన ఆమె తల్లి తండ్రులు, అక్క చెల్లెళ్ళ ఫోటోలను ఆమె కూడా గుర్తించింది. కనుక ఆమె ఈనెల 26వ తేదీన భారత్ తిరిగి వస్తోంది. ఇంతకాలం ఆమె సంరక్షించిన ఈథీ ఫౌండేషన్ అధికారులు ఆమెను తోడ్కొని వచ్చి ఆమె తల్లితండ్రులకి అప్పగించబోతున్నారు. వారు ఆమెకి, ఆమె తండ్రికి డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించి అవి సరిపోలినట్లయితే ఆమెను వారికి అప్పగిస్తారు.