అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సజావుగా పూర్తయిపోయింది. కనుక తరువాత ఏమిటి? అనే ప్రశ్నకు రాజధాని నిర్మాణమే అని జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి కనీసం పదేళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంచనా వేశారు. మొట్టమొదటగా అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణ పనులను ఆరంభించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం విజయవాడలో తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని కమిటీ సభ్యులతో సమావేశమయ్యి సీడ్ క్యాపిటల్ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు.
ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి. కేంద్రం ఇచ్చిన నిధులు కొంచెం చేతిలో ఉన్నాయి. మాష్టర్ ప్లాన్ సిద్దంగా ఉంది. భూమి కూడా సిద్దంగా ఉంది. రాజధాని నిర్మాణానికి అవసరమయిన నిధులు సమకూర్చి నిర్మాణ కార్యక్రమాలు చేప్పట్టడానికి జపాన్ సిద్దంగా ఉంది. రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాల సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు రాజధాని నిర్మాణానికి తన శాఖ తరపున సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంకా కేంద్రంలో మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి చెందిన నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, తెలంగాణాకు చెందిన బండారు దత్తాత్రేయ రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు. అదీగాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దాదాపు కేంద్రమంత్రులు అందరితో చాలా సత్సంబంధాలున్నాయి కనుక వారిలో పీయూష్ గోయల్, ఉమా భారతి, స్మృతీ ఇరానీ వంటి వారు చాలా మంది రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. బహుశః ఇంత సానుకూల పరిస్థితులు ఎప్పడూ చూసి ఉండము. కనుక త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు చాలా పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం కనబడుతోంది.
జపాన్ దేశం అత్యాధునిక యంత్ర పరికరాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాజధాని నిర్మాణం చేప్పట్టబోతోంది. జపాన్ దేశంపై అమెరికా అణ్వస్త్ర దాడి చేసినప్పటి నుండి నేటి వరకు వచ్చిన అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కొని అనేకసార్లు అనేక నగరాలను మెరుపు వేగంతో పునర్నిర్మించుకొన్న అనుభవం ఉందని ఆ దేశం తరపున శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన జపాన్ మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కనుక అమరావతి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగవచ్చును. వచ్చే శీతాకాల శాసనసభా సమావేశాలను అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయం జరిగింది కనుక ముందుగా తాత్కాలిక శాసనసభ భవనాల నిర్మాణం మొదలుపెట్టవచ్చును.