మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ పై హత్యా ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తూ ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ ను ఈరోజు ఉదయం మాల్దీవుల పోలీసులు మాల్దీవుల విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ తన భార్యతో కలిసి సౌదీ అరేబియాలో హజ్ యాత్ర చేసుకొని సెప్టెంబర్ 28వ తేదీన మాల్దీవుల విమానాశ్రయం నుంచి రాజధాని మాలెకు తన స్పీడ్ బోటులో తిరిగివస్తుంటే అందులో అమర్చిన బాంబు పేలింది. ఆ ప్రేలుడులో అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన భార్య, అంగరక్షకుడు గాయపడ్డారు. ఆ సంఘటనపై దర్యప్తు చేసిన పోలీసులు దానిలో ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు ఆయన తన చైనా పర్యటన ముగించుకొని మాల్దీవుల విమానాశ్రయంలో దిగగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు.