ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైకాపాలు చేస్తున్న ఉద్యమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, తెదేపా నేతలు అందరూ కూడా తప్పు పడుతుంటారు. ప్రత్యేక హోదా అంటే అదేమీ సంజీవని మొక్క కాదని ముఖ్యమంత్రి అంటారు. కానీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి కళంకం తెస్తుందని అన్నారు. కనుక కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వచ్చేవరకు కృషి చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు తరలివస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని బాలకృష్ణ అభిప్రాయ పడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెపుతున్నారు. రఘువీరా రెడ్డి కూడా అదే చెపుతున్నారు. కానీ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు మౌనం వహించే తెదేపా నేతలు జగన్, రఘువీరా రెడ్డి ప్రత్యేక హోదా అనే పదం పలికితే అదేదో బూతు పదం అన్నట్లు అందరూ వారిపై కట్టకట్టుకొని విరుచుకుపడుతుంటారు. తెదేపా నేతల తీరు చూస్తుంటే అసలు వారికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ సాధించుకోవాలనే ఆసక్తి, తపన ఉందా లేదా? ఉంటే ఎందుకు ఇంత భిన్నంగా వ్యవహరిస్తున్నారు? అని ప్రజలకు అనుమానాలు కలుగకమానవు.