హైదరాబాద్: పాకిస్తాన్లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 19 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ సంఖ్యం క్రమక్రమంగా పెరుగుతోంది. ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ తీవ్రత 7.7గా నమోదయింది. హిందూకుష్ పర్వత ప్రాంతాలు కేంద్రంగా ఈ భూకంపం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్లో ఈ తీవ్రత 7.5గా నమోదయింది. ఇక్కడకూడా ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మరోవైపు ఇవాళ సంభవించిన ప్రకంపనలకు ఉత్తర భారతదేశంలో పెద్ద నష్టమేమీ జరగలేదుకానీ, ప్రజలు భయాందోళలతో ఇళ్ళు, ఆఫీసులనుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. కాశ్మీర్లో టెలిఫోన్, విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. శ్రీనగర్లో ఫ్లై ఓవర్ పగుళ్ళివ్వటంతో ట్రాఫిక్ నిలిపేశారు.