ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇకపై వారానికి రెండు రోజులు హైదరాబాద్‌లోనే బసచేసి సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ కార్యాలయంలో లేదా నివాసనుంచీ పార్టీ కార్యక్రమాలూ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకు రాజకీయకారణాలు, పాలనా పరమైన కారణాలు సమానంగానే వున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు వరంగల్, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న నిర్ణ యానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. ఓటుకి నోటు కేసు అనంతరం చంద్రబాబు విజయవాడ కు నివాసాన్ని మార్చారు. అదేకేసు వల్ల రేవంతరెడ్డి , దయాకరరెడ్డి వర్గాలు రోడ్డునబడి తిట్టుకోవడంతో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కి గొడుగులేకుండా పోయిన పరిస్ధితి తల ఎత్తింది. మరోవైపు విజయవాడలో ప్రభుత్వ సమావేశాలకోసం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే అధికారుల విమానం ఛార్జీలు, హొటల్ బిల్లులకు కోట్లరూపాయలు చెల్లించవలసి వస్తోంది. ఈ కారణాలే చంద్రబాబు హైదరాబాద్ లో వారానికి రెండురోజులు వుండేలా చేస్తున్నాయి.
అధికారిక సమావేశానికి ఒకటి, రెండు రోజుల ముందు సమాచారం అందిస్తుండటంతో ఐఎఎస్, ఐపీఎస్ అధికా రులు, కార్యదర్శి, ఉప కార్యదర్శులు విమానయానం ద్వారా విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది.ఒక్కో సమయంలో విమాన చార్జీధర రానుపోనూ రూ.15 వేల వరకు ఉంటుంది.ఇలా ఒక శాఖ సమీక్షకు కనీసం 10 నుంచి 15 మంది అధికారులు, సిబ్బంది వెళ్లవలసి వుంది వీరందరికి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి.
ఇక నుంచి కీలకమైన, అత్యంత కీలకమైన సమావేశాలను విజయవాడలో నిర్వహించి శాఖల వారీగా సమీక్షలను హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చంద్రబాబు అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.నెలలో రెండు దఫాలు జరుగుతున్న మంత్రి వర్గసమావేశాల్లో కనీసం ఒక్కటైనా హైదరాబాద్‌లో జరపడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.