హైదరాబాద్: మొన్న ఆయుధ పూజ రోజున ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఎంపీ జితేందర్ రెడ్డి తమ తమ రివాల్వర్లతో గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో, అన్ని పేపర్లలో వచ్చినప్పటికీ పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అకారణంగా ఆయుధాన్ని వినియోగించటం, ఎదుటివారిని భయభ్రాంతులకు గురిచేయటం, అవసరంలేకుండా కాల్పులు జరపటం వంటి చర్యలన్నీ ఆయుధ చట్టం ఉల్లంఘన కిందికే వస్తాయి. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఫిర్యాదులతో సంబంధంలేకుండా పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయొచ్చు. దర్యాప్తులో వెలుగులోకొచ్చిన అంశాల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవటంతోపాటు నోటీసులు జారీచేసి అవసరమైతే లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. అయితే ఇన్ని అవకాశాలున్నా పోలీసులు టీఆర్ఎస్ నేతలపై ఏ చర్యా తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మీడియావారు సంప్రదించినపుడు, ఆయుధ చట్ట ఉల్లంఘనలు ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణైతే చట్టప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని చెబుతున్నారు.
లైసెన్స్ హోల్డర్ కేవలం తనకు ప్రాణహాని ఉన్న సందర్భాలలో మాత్రమే తుపాకిని వినియోగించి కాల్పులు జరపాల్సి ఉంటుంది. సరదా కోసమో, ఆర్భాటంలో భాగంగానో, ఆనవాయితీ పేరుతోనో కాల్పులకు దిగటం చట్టప్రకారం నేరమే. లైసెన్స్ హోల్డర్ ఖరీదుచేేసే, ఖర్చుపెట్టే ప్రతి తూటాకీ ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ప్రతిఏటా పోలీసులు చేసే ఆడిట్‌తోపాటు లైసెన్స్ రెన్యువల్ సమయంలో ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ వ్యవహారాలలో ఏమాత్రం తేడా కనిపించినా రెన్యువల్ చేయకుండా లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. మరి ఇంద్రకరణ్, జితేందర్ రెడ్డిల విషయంలో స్పష్టంగా కనబడుతున్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారో, లేదో చూడాలి. వారి లైసెన్స్‌లను రద్దుచేసి తమ ప్రభుత్వం సగటు మనిషికి, ఉన్నతపదవులలో ఉన్నవారికీ ఒకే న్యాయం అమలుచేస్తుందని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.